Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ చర్యలను నిరసిస్తూ జంగ్ సైరన్ మోగిద్దాం
- బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు
- 8న మంచిర్యాల, భూపాలపల్లి,రామగుండం, కొత్తగూడెంలో మహాధర్నాలు
- ప్రయివేటీకరణపై ప్రధాని ఏం సమాధానం చెబుతారని ఎద్దేవా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రయివేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సింగరేణిలో మరోసారి బొగ్గు గనుల వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ చర్యలను నిరసిస్తూ భారీ స్థాయిలో మహా ధర్నా కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. ఈ నెల 8న మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులతో కలిసి పెద్దఎత్తున ఈ ధర్నాలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మేరకు సింగరేణి ప్రాంతంలోని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో గురువారం కేటీఆర్ మాట్లాడారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ప్రయివేటీకరణ ప్రయత్నాలను ఆపాలని అనేకమార్లు విజ్ఞప్తి చేస్తున్నా... కేంద్రం మాత్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తీసుకొచ్చిందని అన్నారు. ఇప్పటికే పలుమార్లు గనులవేలానికి ప్రయత్నించినా ప్రయివేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదనీ, మరోవైపు ఇవే గనులని నేరుగా సింగరేణికి కేటాయించాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్నా..... కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఆ సంస్థ కార్మికులు, ఇటు రాష్ట్ర ప్రజలు ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరినా, పట్టించుకోకుండా సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ పల్లి, పెనగడప గనుల వేలం కోసం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనీ, వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఇప్పటికే సింగరేణి ప్రయివేటీకరణ ప్రయత్నాలను తమ పార్టీ తరపున, అలాగే ప్రభుత్వం పక్షాన తీవ్రంగా వ్యతిరేకించామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ మేరకు సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికే లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్న మోడీ సర్కార్ సింగరేణిని కూడా తెగ నమ్మేందుకు కంకణం కట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల బాటలో ఉన్న సింగరేణికి.. భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలన్న కుతంత్రంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కూడా గనులు కేటాయించకుండా ఆ సంస్థను దివాలా తీయించిన కేంద్రం..అదే విష ప్రయోగాన్ని ఇక్కడ అమలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని వాపోయారు.
ఇదే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి మాత్రం నామినేషన్ పద్ధతిన భారీగా లిగ్నైట్ గనులు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గుజరాత్ మాదిరిగానే తెలంగాణలోని సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని ఎన్నోసార్లు తమ ప్రభుత్వం కోరినప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ మోడీ చేసిన ప్రకటలన్నీ కల్లబొల్లి మాటలేనని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రధాని హామీకే దిక్కులేకపోతే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. మోడీ మరోసారి రాష్ట్రానికి రాబోతున్న తరుణంలో దానిపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. అటు ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పిఎల్ఎఫ్‌లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణిని ప్రయివేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పే దమ్ము కేంద్ర ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా ఉందా అని ప్రశ్నించారు.