Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎరుపు, బూడిద రంగులో డ్రెస్ కోడ్
- రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులకు ఏర్పాట్లు
- హైదరాబాద్‌లో 938 పాఠశాలలు.. 1.29 లక్షల మంది విద్యార్థులు
- మొత్తం 6.47 లక్షల మీటర్ల వస్త్రానికి.. 1.30 లక్షల మీటర్లు రాక
- టైలర్లకు అందజేసిన ప్రధానోపాధ్యాయులు
- విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు..
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫామ్ (ఏకరూప దుస్తులు) ఈసారి సరికొత్తగా రూపుదిద్దుకుంది. ఎరుపు, బూడిద రంగులో డ్రెస్ కోడ్ అమల్లోకి రాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థుల యూనిఫామ్ కోసం ప్రభుత్వం రూ.140 కోట్లు కేటాయించింది. స్కూల్ యూనిఫామ్‌ను పాఠశాలలు పున:ప్రారంభమయ్యే జూన్ 1 నాటికే ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థినులు, విద్యార్థులకు అందజేయాలి. కానీ ఏటా క్లాసులు ప్రారంభమై.. నెలలు గడిచిపోతున్నా.. అందే పరిస్థితి ఉండేది కాదు. దీంతో విద్యార్థులు పాతబట్టలతోనే తరగతులకు హాజరయ్యే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం(2023-24)లో అలాంటి పరిస్థితి ఉండకూడదని భావించిన ప్రభుత్వం.. ఈసారి ముందుగానే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు బట్ట సరఫరా చేయాలని గత నెలలోనే అధికారులను ఆదేశించింది. హైదరాబాద్ జిల్లాకు వారం రోజుల కిందట ఐదు మండలాలకు సంబంధించి 1.30లక్షల మీటర్ల వస్త్రం చేరగా.. ప్రధానోపాధ్యాయులు వాటిని టైలర్లకు అందించారు. ఈ పని అన్ని జిల్లాల్లో జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.
నవతెలంగా-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 16 రెవెన్యూ మండలాలు ఉండగా.. విద్యాశాఖ వీటిని 24 మండలాలుగా విభజించుకుంది. వీటి పరిధిలో 693 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు.. 245 ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 1.29 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికి యేటా రెండు జతల చొప్పున మొత్తం 2.58లక్షల యూనిఫామ్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు జిల్లాకు 6,47,487,06 మీటర్ల వస్త్రం అవసరం పడుతుంది. ఇందులో ఇప్పటికే గోల్కొండ, హిమాయత్‌నగర్, అంబర్పేట్, నాంపల్లి, అమీర్‌పేట్ మండలాలకు 1.30లక్షల మీటర్ల వస్త్రం సరఫరా చేశారు. యూనిఫామ్ కుట్టేందుకు ఆయా పాఠశాలల పరిధిలోని టైలర్లకు సైతం అధికారులు ఇచ్చేశారు. మిగతా 19 మండలాలకు వారం రోజుల్లో వస్త్రం రానుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
క్లాసుల వారీగా డిజైన్లు ఇవే..
రాష్ట్ర విద్యాశాఖ రానున్న విద్యాసంవత్సరం (2023-24)లో విద్యార్థుల కోసం ఐదు రకాల యూనిఫామ్ డిజైన్లు ఎంపిక చేసింది. రాష్ట్ర చేనేత సహకార సంస్థ (ట్రెస్కో) ప్రత్యేకంగా క్లాత్‌ను విద్యాశాఖకు అందించింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఎరుపు, బూడిద రంగులలో యూనిఫాం, 4-5వ తరగతి విద్యార్థిను లకు స్కర్ట్, దానిపై పట్టీలతో కూడిన షర్ట్ యూనిఫాం, 1 నుంచి 3వ తరగతి విద్యార్థినుల యూనిఫాం కుడివైపు ప్యాకెట్‌తో ఫ్రాక్, సూటింగ్ క్లాత్‌తో కుట్టిన బెల్ట్ రింగులు, స్లీవ్‌లపై సూటింగ్ రంగు పట్టీలతో ముద్రించిన ఎరుపు, బూడిద రంగు గీతలతో చొక్కా ఎంపిక చేశారు. 1వ నుంచి 7వ తరగతి బాలురకు నిక్కర్, షర్టు, 8 నుంచి 12వ తరగతి బాలురకు ప్యాంట్, చొక్కా అందనున్నాయి.
సరిపోని కుట్టు కూలి..!?
ప్రభుత్వ బడుల్లో 1-7 తరగతి వరకూ విద్యార్థులకు నిక్కర్, చొక్కా, 8-10 వరకు ప్యాంటు, చొక్కా అందిస్తారు. కింది తరగతి విద్యార్థినులకు స్కర్ట్, 8-10 తరగతి వరకు పంజాబీ డ్రెస్ అందజేస్తారు. ఒక్కో జత కుట్టేందుకు దర్జీకి రూ.50 వరకు చెల్లిస్తారు. ఇలాంటి డ్రెస్‌లు కుట్టేందుకు బయట టైలర్లు రూ.300-500 వరకు వసూలు చేస్తారు. ఇందుకు నాణ్యమైన గుండీలు, దారం ఉపయోగించటం వల్ల కుట్టు మన్నికగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకు అందించే దుస్తుల కుట్టు కూలి రూ.50 మాత్రమే ఉంది. దాంతో కొందరు కాంట్రాక్టర్లు నాసిరకం దారం, గుండీలు ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రభుత్వమిచ్చే కుట్టు కూలి గిట్టుబాటు కాక.. చాలామంది టైలర్లు.. తరగతుల వారీగా విద్యార్థిని, విద్యార్థుల కొలతలను అంచనా వేసి దుస్తులు కుడుతున్నారు. ఫలితంగా పంపిణీ అనంతరం విద్యార్థుల్లో కొందరికి బిగుతుగా, వదులుగా ఉంటున్నాయి.
7వ తరగతి విద్యార్థులకు నిక్కర్!!
ప్రభుత్వం 1-7 తరగతి విద్యార్థులకు నిక్కర్, చొక్కా అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం అంతంతే. అలాంటిది ఏడో తరగతి విద్యార్థులను నిక్కర్ తొడుక్కొని స్కూళ్లకు రావాలంటే ఇబ్బందిగా ఫీలవుతు న్నారు. కొంతమంది సొంత డబ్బుతో దుస్తులు కుట్టించుకుం టున్నారు. ఇది నిరుపేద కుటుంబాలకు భారమే. ఇదిలావుంటే, ఒక తరగతి గదిలో అందరూ ఒకే విధంగా ఉండరు. కొందరు పొడవు, పొట్టిగా వారివారి శరీర తత్వాన్ని బట్టి ఉంటారు. ఈ నేపథ్యంలో 8-10 తరగతి విద్యార్థుల మాదిరిగానే 5-7 తరగతి విద్యార్థులకు ప్యాంట్, షర్ట్ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.
కుట్టుకూలి పెంచితే మరింత నాణ్యతగా..
విద్యాశాఖ కొనుగోలు చేసి ఇచ్చిన క్లాత్ ఒక్కో జత కుట్ట డానికి రూ.50 చెల్లిస్తోంది. కుట్టు కూలి తక్కువ కావడంతో నాణ్యత ఉండటం లేదని తల్లిదండ్రులు, పలువురు ప్రధానో పాధ్యాయులు చెబుతున్నారు. నగరంలో టైలర్ల మధ్య పోటీ కారణంగా తక్కువ ధరకు కుట్టడానికి కొందరు ముందుకు వస్తున్నారు. కానీ కుట్టు మన్నికగా ఉండటం లేదు. కొంత మంది ఉన్నదాంట్లోనే కొంచెం నాణ్యతతో అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఒక్కో జతకు ఇచ్చే కూలి పెంచితే యూనిఫామ్స్ మరింత నాణ్యతగా అందిస్తా మని నగరానికి చెందిన ఓ టైలర్ తెలిపారు.
బడుల ప్రారంభానికి ముందే యూనిఫాం..
గత నెలలో టెస్కో సంస్థ నుంచి నేరుగా జిల్లాలోని మండలాల పాయింట్లకు క్లాత్ చేరింది. వచ్చిన క్లాత్‌ను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశాం. వారు టైలర్లకు అందించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలలు పున:ప్రారంభమయ్యే లోపే విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేస్తాం.
- కనీజ్ ఫాతీమా
సెక్టోరియల్ అధికారి, హైదరాబాద్.