Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికాలంగా జీతాల్లేని ల్యాబ్ సిబ్బంది
- జీతాలడిగితే ఉన్నతాధికారుల చులకన మాటలు
- ఆందోళనకు దిగలేక.. కుటుంబం గడవక
- ఆకలితో గడుపుతున్న 320 కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది
- ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న జీతాల బకాయిలే రూ.7.70కోట్లు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
మిషన్ భగీరథ శాఖలో నీటి నాణ్యతా ప్రమాణాలను పరీక్షించి ఫలితాలు అందించే ప్రయోగశాలల సిబ్బంది బతుకు భారంగా మారింది. ఏడాది కాలంగా జీతాలు రాక ఆ ఉద్యోగుల కుటుంబాలు అప్పులపాలయ్యాయి. రెన్నెళ్లు, మూన్నెళ్లు.. ఎదురుచూసిన సిబ్బంది ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటూ వచ్చినా.. వేతనాలు రాక ఏడాది గడిచిపోయింది. పది రోజుల కిందట సంబంధిత శాఖ ఉన్నతాధికారులను కలిస్తే 'ఉంటే ఉండండి.. లేదంటే ఉద్యోగం మానేయండి.. ఎక్కువ మాట్లాడితే మేమే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం' అంటూ బెదిరింపులతో చులకన చేసి మాట్లాడారని పలువురు సిబ్బంది 'నవతెలంగాణ'తో వాపోయారు. ఆందోళనకు దిగలేక.. జీతాలు రాక కుటుంబం గడవక వారంతా ఆకలితో అలమటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 320 మంది సిబ్బందికి సంబంధించి ఏడాది కాలంగా జీతాల బకాయిలే రూ.7.70కోట్లు ఉన్నాయంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గ్రామీణ నీటి సరఫరా శాఖ పరిధిలో ఉన్న నీటి నాణ్యత పరీక్ష కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం 'మిషన్ భగీరథ' శాఖలో విలీనం చేసింది. దీని కింద ఒక రాష్ట్ర స్థాయి ల్యాబ్ సహా 9 పాత జిల్లా కేంద్రాలు, మరో 9 డివిజన్ స్థాయి, 57 సబ్ డివిజన్ స్థాయి కేంద్రాలుగా వీడదీ సింది. రాష్ట్ర వ్యాప్తంగా 75 నీటినాణ్య తను పరీక్షించే ల్యాబ్‌లను నిర్వహి స్తోంది. ఇందులో కెమిస్ట్, మైక్రోబయా లజిస్టు, హెల్పర్, ఫీల్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ కలిపి మొత్తం ఆరుగురు చొప్పున 9 పాత జిల్లా కేంద్ర ల్యాబ్‌ల్లో పని చేస్తున్నారు. మిగిలిన 64 కేంద్రాల్లో ల్యాబ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ మినహా.. నలుగురు సిబ్బంది చొప్పున విధుల్లో ఉన్నారు. వీరి పనిని పర్యవేక్షించేందుకు అదనంగా ప్రతి పాత జిల్లా కేంద్రంగా ఒక కన్సల్టెంట్ ఉద్యోగి ఉన్నారు. మొత్తంగా మిషన్ భగీరథ శాఖలోని నీటి నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌ల్లో 319 మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారు.
వేతనం రాకున్నా ఆగని నీటి నమూనా పరీక్షలు
కన్సల్టెంట్లు, కెమిస్ట్‌లు, మైక్రోబయాల జిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, హెల్పర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లంతా ఔట్సోర్సింగ్ కిందనే విధులు నిర్వహిస్తున్నారు. నీటి నమూనాలను సేకరించి, వాటిని పరీక్షించి ఫలితాలను గుర్తిస్తూ ఉంటారు. ఆ నాణ్యతా ప్రమాణాలపై సమాచారాన్ని నిత్యం నమోదు చేస్తుంటారు. గ్రామపంచాయ తీలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నమూనాలు సేకరించి, నీటి నాణ్యతపై అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి నెలా ఒక్కో ల్యాబ్ నుంచి 250 నమూనాల నాణ్యత పరీక్ష సహా 50 సూక్ష్మజీవన నీటి పరీక్ష ఫలితాలు నమోదు చేస్తున్నారు.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెలా 22,500 నమూనాలను నిత్యం పరీక్షించి ఫలితాలు నమోదు చేస్తుంటారు. ఏడాది కాలంగా జీతం రాకపోయినా 2.70లక్షల నమూనాలను పరీక్షించి ఫలితాలు సమోదు చేశారు. వీరు ఏండ్లుగా పని చేస్తున్నా.. ఉద్యోగాలు పర్మినెంట్కాక ఔట్సోర్సింగ్ పద్ధతిలోనే సాగుతున్నారు.
జీతాల బకాయిలే రూ.7.70కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబ్‌ల్లో పని చేస్తున్న 319 మంది సిబ్బందికి ఏడాది కాలంగా జీతాలు రావడం లేదు. వీరికి వారి ఉద్యోగ స్థాయిని బట్టి నెలకు రూ.16వేల నుంచి రూ.22వేల వరకు ఇస్తున్నారు. కన్సల్టెంట్లకు రూ.35వేలు ఇస్తున్నారు. అయితే ఈ మొత్తం సిబ్బందికి నెలకు రూ.64లక్షల 18వేల 500 జీతాలు చెల్లించాల్సి ఉంది. ఏడాదికి (12నెలలకుగాను) రూ.7కోట్ల 70లక్షల 22వేలు జీతాల రూపంలో ప్రభుత్వం బకాయి పడింది.
జీతాలడిగితే ఉన్నతాధికారుల చులకన
ప్రతినెలా జీతాలు రాక అప్పులు చేసి కుటుంబాలను వెళ్లదీసుకుంటున్న ఉద్యోగులు పైఅధికారులకు విన్నవించుకుంటూ వస్తున్నారు. ఈ నెల వస్తాయి. వచ్చే నెల వస్తాయి అంటూ దాటవేస్తూ వచ్చిన ఉన్నతాధికారులు తీరా ఇప్పుడు కటువుగా సమాధానాలు ఇస్తున్నారని అంటున్నారు. 'ఇష్టం ఉంటే చేయండి.. లేదంటే మానేయండి' అని, 'ఎక్కువగా మాట్లాడితే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం' అంటూ బెదిరింపులకు దిగుతున్నారని సిబ్బంది వాపోయారు.