Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని పనులు గ్రౌండింగ్ కావాలి: మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వారం రోజుల్లోగా టెండర్లు పూర్తి కావాలి. అన్ని పనులను గ్రౌండింగ్ చేయాలి. కాంట్రాక్టర్లు రావడం లేదనే కారణాలు చెప్పొద్దు. అధికారుల్లో అలసత్వాన్ని సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవు అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ రోడ్ల నిర్వహణ పనులపై సంబంధిత అధికారులతో హైదరాబాద్లో మంత్రి గురువారం సమీక్షించారు. రాష్ట్రంలో మొత్తం రూ.2,687 కోట్ల అంచనా వ్యయంతో 6,254 కి. మీ. మేర 3,010 బిటి రోడ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో టెండర్లు పూర్తికాని, గ్రౌండ్ కాని పనులను రద్దు చేయాలని సూచించారు. రద్దయిన పనులను వేరే నియోజకవర్గాలకు బదిలీ చేస్తామని హెచ్చరించారు. ఇందులో పలు పనులు ఇప్పటి వరకు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్నింటికి ఇంకా టెండర్లు పిలవాల్సి ఉందని తెలిపారు. వీటిని తొందరగా సెటిల్ చేయాలని కోరారు. వారం రోజుల్లోగా అన్ని పనులకు టెండర్లు పూర్తి కావాలనీ, అవన్ని గ్రౌండింగ్ అయి ఉండాలని సూచించారు.