Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా ఐఆర్టీఎస్ అధికారి ఆర్ ధనంజయులు గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఆయన దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం)గా విధులు నిర్వహించారు. మొట్టమొదటగా రైల్వేలో ఏరియా ఆఫీసర్/వాస్కోగా ఆయన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆపరేషన్స్, సేఫ్టీ, కమర్షియల్ డిపార్ట్మెంట్లలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ విభాగాల్లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్, దక్షిణ మధ్య రైల్వే సెక్రెటరీ జనరల్ మేనేజర్, విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్‌గా కూడా పనిచేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు స్పెషల్ డ్యూటీ ఆఫీసర్‌గా నామినేట్ అయ్యారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (కాంకర్) చీఫ్ జనరల్ మేనేజర్‌గా డిప్యూటేషన్‌పై పనిచేశారు. ధనంజయులు ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా ఉన్న సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే 131.854 మిలియన్ టన్నుల సరుకు రవాణాను చేసింది. ఇది జోన్ చరిత్రలో అత్యుత్తమ పనితీరు. దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13039.25 కోట్ల సరుకు రవాణా ఆదాయంగా నమోదు చేసింది. ఇది జోన్ ప్రారంభమైనప్పటి నుండి ఏ ఆర్థిక సంవత్సరంతో పోల్చినా సరుకు రవాణాలో అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసింది.