Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యదర్శికి యూఎస్పీసీ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హన్మకొండ జిల్లా కమలాపూర్ ఉన్నత పాఠశాలలో హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన సంఘటనలో ఇన్విజిలేటర్ సబియా మదాహత్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆ జిల్లా డీఈఓ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. సమగ్ర విచారణ అనంతరమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను గురువారం యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, వై అశోక్ కుమార్, టి లింగారెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈనెల నాలుగో తేదీన హన్మకొండ జిల్లా కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) రూమ్ నంబర్ మూడు నుంచి పదో తరగతి హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన సంఘటనలో బాధ్యురాలిని చేస్తూ ఆ రూమ్‌లో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న నేరెళ్ల యూపీఎస్ ఉపాధ్యాయిని సబియా మదాహత్ను ఎటువంటి విచారణ లేకుండా సర్వీసు నుంచి తొలగిస్తూ అదేరోజు ఆ జిల్లా డీఈఓ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీ పేరుతో ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయటానికో లేక సంచలనం సృష్టించటానికో రాజకీయ కుట్ర కోణంలో ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. దర్యాప్తు సాగుతున్నదని వివరించారు. ఎవరి పాత్ర ఏమిటో విచారణలో తేలుతుందని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థుల్లో గందరగోళం సృష్టించి, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయటానికి ప్రయత్నించిన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అయితే గది నుంచి ప్రశ్నాపత్రం బయటకు పోవటంలో ఇన్విజిలేటర్ ఏమరుపాటు కారణమైతే కావచ్చు కానీ ఉద్దేశపూర్వకంగా నిందితులకు సహకరించినట్టు నిరూపణ కాలేదని పేర్కొన్నారు. మొదటి పావుగంటలో ఓఎంఆర్ షీట్లను చెక్ చేసి సంతకాలు పెడుతున్న క్రమంలో ఊహించని రీతిలో మైనర్ బాలుడు చెట్టెక్కి మొదటి అంతస్తుకు వచ్చి కిటికీ చాటునుంచి ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసిన విషయం గమనించలేదని వివరించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపకుండా, తీవ్రమైన దండన విధించే సందర్భంలో అనుసరించాల్సిన కనీస సీపీఏ నిబంధనలు పాటించకుండానే ఉపాధ్యాయురాలిని ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించటం సమంజసం కాదని తెలిపారు. హన్మకొండ డీఈఓ చర్య రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నదని విమర్శించారు. పదో తరగతి పరీక్ష విధులు నిర్వహించాలంటేనే ఉపాధ్యాయులు భయపడే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. విద్యాశాఖ కార్యదర్శి జోక్యం చేసుకుని డీఈఓ ఉత్తర్వులను నిలిపేయాలని కోరారు. సమగ్ర విచారణ జరిపించిన అనంతరమే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.