Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హనుమకొండ
పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌కు బెయిల్ మంజూరయింది. దీనిపై రోజంతా హైడ్రామా నడిచింది. హనుమకొండ జిల్లా కోర్టులో గురువారం మధ్యాహ్నం 2.30 గంటల నుండి రాత్రి పొద్దు పోయేవరకు దాదాపు ఎనిమిది గంటలు వాడి వేడిగా ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించారు. బండి సంజయ్ తరఫున అడ్వకేట్లు సి. విద్యాసాగర్ రెడ్డి, చోల్లేటి రామకృష్ణ, సంసాని సునీల్ తమ వాదనలు వినిపించారు. శుక్రవారం తన అత్తగారి దశదినకర్మ ఉందని, శనివారం ప్రధానమంత్రి మోడీ పర్యటన హైదరాబాద్‌లో ఉందని, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ అతని పర్యటనలో ఉండాలి కాబట్టి తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాలని వాదించారు. కస్టడీ రిపోర్టు పెండింగ్‌లో ఉండగా అది కుదరదని న్యాయమూర్తి చెప్పడంతో పోలీసులు ఎప్పుడు విచారణకు హాజరుకమ్మంటే అప్పుడు హాజరవుతారని తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేవతి.. తమ వాదనలు వినిపిస్తూ బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, ఒకవేళ అతనికి బెయిల్ ఇస్తే సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని, ఇప్పటికే బండి సంజయ్ ఫోన్ ఆచూకీ లేదని, ఆ ఫోన్లో విలువైన సమాచారం ఉందని, కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని గట్టిగా వాదించారు. హైకోర్టు కూడా ఈ కేసును సోమవారంకు వాయిదా వేసిందని, బెయిల్ పిటిషన్‌నూ సోమవారంకు వాయిదా వేయాలని కోరారు. కాగా, బెయిల్ పిటిషన్‌పై ఈ రోజే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తాము హైకోర్టుకు వెళ్లే అవకాశం కోల్పోతామని, అవసరమైతే కేసును ఉపసంహరించుకుంటామని సంజయ్ తరఫున అడ్వకేట్లు వాదించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇలాంటి కేసును ఇంతవరకు చూడలేదని, ఈ కేసును ప్రత్యేకంగా గ్రౌండ్స్ కింద విచారిస్తామని అన్నారు. చివరకు రాత్రి 10 గంటలకు న్యాయమూర్తి బండి సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.20వేల పూచీ కత్తుతో డిఫెన్స్ లాయర్ల వాదనతో ఏకీభవించి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. శుక్రవారం మధ్యాహ్నంకు బండి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈటల రాజేందర్‌కు నోటీసులిచ్చిన పోలీసులు పదవ తరగతి పరీక్ష లీక్ కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఈటల రాజేందర్‌కు వరంగల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ ముందు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో స్పందించిన ఈటల రాజేందర్ వరంగల్ డీసీపీకి ఉత్తరం రాశారు. తనకు ముందున్న షెడ్యూల్ ప్రకారం శుక్రవారం హాజరు కాలేనని, ఈ నెల పదవ తారీఖున హాజరవుతానని తెలిపారు.