Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8న ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనలు : కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈనెల ఎనిమిదో తేదీన ఆయన హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ విగ్రహాల వద్ద నల్లబ్యాడ్జీలు, నల్ల జెండాలతో నిరసనలు చేపడతామని పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం వంటి విభజన హామీలను అమలు చేయ లేదని తెలిపారు. సింగరేణిలోని సత్తుపల్లి, ఇల్లందులోని కోయగూడెం, మందమర్రిలో మొత్తం నాలుగు బొగ్గు గనుల ప్రయివేటీకరణ కోసం టెండర్లు పిలవడాన్ని తీవ్రంగా ఖండించారు. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి వచ్చినపుడు సింగరేణిని ప్రయివేటీ కరణ చేయబోమంటూ ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ బొగ్గు గనుల కోసం మళ్లీ టెండర్లు పిలిచి ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు ఆడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.