Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షా కేంద్రం వద్ద అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్
- ప్రత్యేకంగా అభినందించిన సీపీ
- రూ.500 క్యాష్ రివార్డు అందజేత
నవతెలంగాణ- సిటీబ్యూరో
పదో తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్లో వైరల్ అవడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టింది. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని అధికారులు పూర్తిగా నిషధించారు. ఈ క్రమంలో గురువారం పదో తరగతి పరీక్ష జరుగుతున్న కేంద్రాలను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ స్వయంగా పరిశీలిం చారు. ఎల్బీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్దకు వచ్చిన సీపీకి అక్కడున్న అధికారులు సెల్యూట్ చేశారు. ఆ తర్వాత పరీక్షా కేంద్రంలోకి వెళ్తున్న సీపీని అక్కడే విధుల్లో ఉన్న ఎల్బీనగర్ పోలీస్టేషన్ మహిళా కానిస్టేబుల్ కల్పన ఆపారు. 'సీపీ సర్.. ప్లీస్ పరీక్షా కేంద్రంలోకి ఫోన్ అనుమతి లేదు' అని గుర్తు చేశారు. దాంతో అక్కడున్న మిగతా పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కానీ సీపీ డీఎస్ చౌహాన్ తన వద్ద ఉన్న ఫోన్ను కానిస్టేబుల్కు అప్పగించి లోపలికి వెళ్లిపోయారు. సీపీ తిరిగి బయటకు వచ్చాక కానిస్టేబుల్ను ప్రత్యేకంగా అభినందించారు. క్యాష్ రివార్డు రూ.500 ఆమెకు అందజేశారు. తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించిన కానిస్టేబుల్ కల్పనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తనిఖీల్లో సీపీ వెంట ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ శ్రీధర్ రెడ్డితో పాటు ఇతర అధికారులున్నారు.