Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఈ నెల 11న చలో హైదరాబాద్ :
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, నాగరాజు
నవ తెలంగాణ - సిద్దిపేట
'నూతన విద్యా విధానం పేరిట విద్యను వక్రీకరించడమే కాక, బడుగు, బలహీన తరగతులను విద్యకు దూరం చేసేలా చర్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ ఎల్ మూర్తి, నాగరాజు అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సమావేశాలు మూడు రోజులుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివం గార్డెన్లో నిర్వహించారు. గురువారం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ మీద ఇంకా స్పందించకపోవడం దారుణమన్నారు. దీనిపై ఈ నెల 11న హైదరాబాద్లోని ధర్నా చౌక్ (ఇందిరాపార్క్) వద్ద ఒకరోజు విద్యార్థి, నిరుద్యోగ మహా దీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, వివిధ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. విద్యాసంవత్సరం పూర్తయినా నేటికీ ఉర్దూ, మరాఠి మీడియం పుస్తకాలు రాలేదన్నారు. చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా పర్మిషన్ ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రయివేటు విద్యా సంస్థలను కట్టడి చేయాలంటే ఫీజులపై నియంత్రణ కమిటీని వేయాలని కోరారు. ప్రయివేటు విద్యాలయాల్లో 27 శాతం ఉచిత సీట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వానికి నిరుద్యోగులపై చిత్తశుద్ధి ఉంటే.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలకు వేదికలవుతున్న ఉస్మానియా, కాకతీయ, శాతవాహన లాంటి యూనివర్సిటీలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు. యూనివర్సిటీల్లో ఒక పోస్టు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరిట విద్యను కాషాయీకరణ, వ్యాపారీకరణ చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు. మూఢనమ్మకాలను నమ్మే విధంగా అంశాలు పెడదామనడం ఎంతవరకు న్యాయమన్నారు. విద్యారంగ సమస్యలపై రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చించామని, సిద్దిపేటలో యూనివర్సిటీ ఏర్పాటు, మెడికల్ కళాశాల సీట్లు పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల, కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాలలు పెంచాలని, బీఎస్సీ నర్సింగ్ హాస్టల్కు పక్కా భవనం నిర్మించాలన్నారు. పలు అంశాలపై తీర్మానాలూ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, సిద్దిపేట జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రెడ్డమైన అరవింద్, దాసరి ప్రశాంత్, రాష్ట్ర నాయకులు శంకర్, రాజు, మిశ్రిన్ సుల్తానా, కిరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.