Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు తలపెట్టిన సామాజిక న్యాయ వారోత్సవాలు బిటి రణదివే వర్ధంతి సందర్భంగా ప్రారంభమయ్యాయి. సంగారెడ్డిలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బీరం మల్లేష్ అధ్యక్షతన సామాజిక సమస్యలు-కార్మికవర్గ కర్తవ్యం అనే అంశంపై సెమినార్ను నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ సంఘటిత పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కార్మికవర్గంలో ఐక్యతను సాధిస్తేనే అన్ని రకాల వివక్ష, అణచివేత, దోపిడీని అంతం చేయగలమని అన్నారు. బిటి రణదివే స్ఫూర్తితో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో బిటి రణదివే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ రణదివే కులం, వర్గం, ఆస్తి సంబంధాల పుస్తకాన్ని రాస్తూ కులవ్యవస్థ అసమానతలపై ప్రత్యక్ష దాడిని ప్రారంభించారని గుర్తు చేశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మొదలైన వాటితోపాటు కుల వ్యతిరేక పోరాటాలకు మద్దతునివ్వాలంటూ ఆయన వాదించే వారని చెప్పారు. సిద్ధిపేట, గజ్వేల్, చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం, పటాన్చెరు, సాడ్విక్ పరిశ్రమ, మహీంద్ర పరిశ్రమ, టీఐడీసీ పరిశ్రమ, పార్లే ఆగ్రో, యూబీ, కిర్బీ, తోషిబా, సిబిఎల్ పరిశ్రమలు, మేడ్చల్, జనగామ, ఖమ్మం, నల్లగొండ, మంచిర్యాలలో రణదివే వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈనెల 11న జ్యోతిబాఫూలే, 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులను కూడా నిర్వహించాలని, ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా 10కె రన్, వాక్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు.