Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బఫర్ జోన్ లేదు.. ప్రజలు అధైర్య పడొద్దు : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ఫార్మా భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణి
నవతెలంగాణ-కందుకూరు
ఫార్మాసిటీ కంపెనీల ఏర్పాటుతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటయ్యే 19 వేల ఎకరాల్లో అర కిలో మీటర్ మేర బఫర్ జోన్‌కు ప్రతిపాదనలు జరుగుతున్నాయని, రైతులకు ఇబ్బందులు కలగకుండా మాస్టర్ ప్లాన్ ఉంటుందని తెలిపారు.
గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో ఆ గ్రామ సర్పంచ్ బుక్క మహేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితా రెడ్డితో కలసి ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు, ప్రతి రైతుకూ ఎకరాకు 121 గజాల చొప్పున ఇల్లు నిర్మించుకోవడానికి స్థలాలు ఇస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రైతులకు ఇండ్ల స్థలాలు ఇచ్చామన్నారు.
గత ప్రభుత్వాలు రైతుల నుంచి భూములు తీసుకున్నా ఇలాంటి మంచి కార్యక్రమం చేయలేదన్నారు. తుక్కుగూడ నుంచి కందుకూరు మండలం వరకు అనేక కంపెనీలు వస్తున్నాయని అన్నారు. భవిష్యత్తులో కందుకూరు మండలానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. రైౖతులు భూములు, ఇండ్ల స్థలాలు అమ్ముకోవద్దని సూచించారు. ఫార్మా భూ నిర్వాసితులకు ఇంతకుముందే 518 మందికి ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. సాయిరెడ్డిగూడలో 125 మందికి ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు పంపిణీ చేశామన్నారు. రాబోయే కాలంలో కందుకూరు మండలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మహేశ్వరం మార్కెటింగ్ చైర్మెన్ సురసాని సురేందర్‌రెడ్డి, కందుకూరు సహకార సంఘం చైర్మెన్ దేవరశెట్టి చంద్రశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.