Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్య ఉరి.. భర్త సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని.. ఆత్మహత్య
నవతెలంగాణ-జనగామ
భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా, గంట వ్యవధిలోనే భర్త ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదేండ్లుగా జనగామ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కాసర్ల శ్రీనివాస్ (55) దంపతులు పట్టణంలోని వెంకన్నకుంట హాల్లో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం ఎస్ఐ భార్య స్వరూప (50) బాత్రూమ్కి వెళ్లి కిటికీకి చున్నీతో ఉరి వేసుకున్నది. కాగా, పాలు పోయడానికి వచ్చిన వ్యక్తి తలుపుకొట్టగా.. నిద్రలేచిన శ్రీనివాస్.. బాత్రూమ్లోకి వెళ్లగా.. భార్య విగతజీవిగా కనిపించింది. విషయం తెలుసుకున్న వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాం, ఏసీపీ దేవేందర్ రెడ్డి, నర్మెట్ట సీఐ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్వరూప మృతికి కారణం ఏంటని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వాష్‌రూమ్ కని బెడ్రూమ్లోకి వెళ్లిన వెళ్లిన శ్రీనివాస్.. మనస్తాపంతో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు.
అక్కడే ఉన్న అధికారులు.. కాల్చుకున్న శబ్దం విని లోపలికి వెళ్లి చూడగా.. అప్పటికే మృతిచెంది ఉన్నారు. మృతులకు ఇద్దరు కుమారులున్నారు. వారు ఉద్యోగాల రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. దంపతుల మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. కాగా, ప్రజలు, అధికారులు, తోటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి మృతిచెందడం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే, దంపతుల మధ్య ఆర్థిక, కుటుంబ సంబంధిత విషయాలపై బుధవారం రాత్రి గొడవ జరగిందని డీసీపీ తెలిపారు. ఎస్ఐ దంపతుల ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి పూర్తి వివరాలు అందిస్తామని తెలిపారు.
శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించిన వరంగల్ సీపీ
భార్య చనిపోయిందన్న మనస్తాపంతో ఆత్మ హత్యకు పాల్పడిన జనగాం ఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు అతని భార్య మృతదేహాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించి, మృత దేహాలపై పూల మాలలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఎస్ఐ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. దహన సంస్కారాల నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ.20 వేలు సీపీ అందజేశారు. ఎస్ఐ శ్రీనివాస్ దంపతులకు నివాళులర్పించిన వారిలో డీసీపీ సీతారాం, ట్రైనీ ఐపీఎస్ అంకిత్ కుమార్ శంక్వర్, జనగామ ఏఎస్పీ దేవేందర్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి శోభన్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.