Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవత్వాన్ని మరుస్తున్న యువత..
- చారిత్రక ఓరుగల్లు నగరానికి రావడం సంతోషంగా ఉంది :
నిట్ వరంగల్ స్ప్రింగ్ స్ప్రీ వేడుకను ప్రారంభించిన పవన్ కళ్యాణ్
నవతెలంగాణ-కాజీపేట
నిట్ వరంగల్లో జరిగిన స్ప్రింగ్ స్ప్రీ -2023 వేడుకలు కులమతాలకతీతంగా విద్యార్థులందరినీ ఒక్కటి చేశాయని, చారిత్రక ఓరుగల్లు నగరానికి రావడం సంతోషంగా ఉందని జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ అన్నారు. వరంగల్లోని జాతీయ సాంకేతిక విద్యాలయం (నిట్)లో ఈనెల 7వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న స్ప్రింగ్ స్ప్రీ-2023 వేడుకలకు దేశంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏకశిలా నగరం, వేయిస్తంభాల గుడి, గొలుసు కట్టు చెరువులు, రాణి రుద్రమదేవి పాలించిన ఓరుగల్లు నగరానికి రావడం సంతోషంగా ఉందన్నారు. బమ్మెర పోతన, దాశరథి, కాళోజీలను గుర్తు చేశారు. విద్యార్థులు ఎప్పుడూ నేర్చుకోవడం ఆపొద్దని, నేర్చుకోవడంతో నూతన ఆలోచనలు వస్తాయని, వాటికోసం ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఇటీవల నిట్ వరంగల్ విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్స్ సాధించడం అభినందనీయమన్నారు. చేసే పనిలో మొదట ఫెయిలైనా తిరిగి ప్రయత్నిస్తే భవిష్యత్తులో విజయం సాధిస్తారని తెలిపారు. కలలుకని సాకారం చేసుకుని దేశ సేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని యువతకు పిలుపునిచ్చారు. తాను రాజకీయాల్లోకి రాకముందు అనేక సేవా కార్యక్రమాలు చేశానని, ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు చేయూతను అందించడమే లక్ష్యంగా ముందుకు రావడం జరిగిందన్నారు. ప్రస్తుతం యువత ప్రజలు మానవత్వాన్ని మరుస్తున్నారని మానవత్వ విలువలు కోల్పోవద్దన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకొని లక్ష్యాన్ని ఎంచుకొని వాటి సాధన దిశగా ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణ రావు మాట్లాడుతూ.. స్ప్రింగ్ స్ప్రీ వేడుకలను ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ ఏడాది 50 పైగా ఈవెంట్లు ఈ వేడుకల్లో జరుగుతాయని తెలిపారు. విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపడానికి 1978 నుంచి ఈ వేడుకలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామన్నారు. నిట్ వరంగల్లో 6,892 మంది విద్యార్థులు చదువుతున్నట్టు. ప్రతి విద్యార్థి వేడుకలో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీన్, స్టూడెంట్ వెల్ఫేర్ ప్రొఫెసర్ పులి రవికుమార్, ఫ్యాకల్టీ అడైజ్వర్ హీరోలాల్, స్టూడెంట్ కమిటీ సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.