Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో రోజురోజుకూ దిగజారుతున్న కాంగ్రెస్ ప్రతిష్ట
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ జహీరాబాద్
దేశంలో, రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే దమ్ము కేసీఆర్‌కే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనశ్రీ గ్రామంలో మంత్రి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కర్నాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ధనసిరివాసులకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఏంటో బాగా తెలుస్తున్నాయన్నారు. సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చూసి కర్నాటక, మహారాష్ట్ర నుంచి ఎంతోమంది కార్యకర్తలు, రైతులు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వస్తున్నారని తెలిపారు. రైతుల విద్యుత్ సరఫరాకు మీటర్లు బిగించనందున కేంద్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఆపివేసిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ చొరవతో రూ.2 వేల కోట్లు ఖర్చుపెట్టి విద్యుత్ కొనుగోలు చేసి ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని పథకాలు అమలులో ఉన్నాయా అని ప్రశ్నించారు. షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, కంటి వెలుగు, రైతుబంధు లాంటి అనేక పథకాలు విజయవంతంగా కొనసాగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. బీజేపీ.. కేవలం మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లను చీల్చి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. పేపర్ లీకేజీ దొంగలు జైల్లో పడ్డ అనంతరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటన్నింటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థులు మెజార్టీ స్థాయిలో గెలుపొందాలన్నారు. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర మూతిమాత జాతరను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత తమ ప్రభుత్వాన్నిదేనని తెలిపారు.
ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కృషి కారణంగా జహీరాబాద్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్ మంజు శ్రీ రెడ్డి, జడ్పీటీసీ అరుణ మోహన్ రెడ్డి, సర్పంచ్ రాజు, జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, డీసీఎంఎస్ చైర్మెన్ శివకుమార్. నాయకులు, తదితరులు పాల్గొన్నారు.