Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
పదో తరగతి పేపర్ లీక్ చేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ను హన్మకొండ కోర్టు రిమాండ్‌కు పంపుతూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని బండి చేసిన వినతిని తోసిపుచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని కమలాపూర్ హైస్కూల్ హెడ్మాస్టర్ ఎం. శివప్రసాద్, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. హౌం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ ఇతర ప్రతివాదులు కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల పదోతేదీ సోమవారానికి వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయకుండా బండిని అరెస్టు చేశారు. 41ఎ నోటీసు ఇవ్వలేదు. నేరుగా అరెస్టు చేశారు. రాత్రి 12 గంటలకు అరెస్టు చేసి 300 కిలోమీటర్లు తిప్పారు. కరీంనగర్ పీఎస్‌లోని కేసులో అనేక చోట్లకు తిప్పారు.బొమ్మలరామారం స్టేషన్‌కు తీసుకువెళ్లారు. పాలకుర్తి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి హన్మకొండ కొర్టులో హాజరుపర్చారు. పీఎం మోడీ 8న వస్తున్న కారణంగానే బండిపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారు. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నందున వాటికి ఎంపీగా బండి హాజరుకావాలి. కాబట్టి రిమాండ్ రిపోర్టును రద్దు చేయాలి.. అని బండి తరఫున సీనియర్ అడ్వొకేట్ ఎన్.రామచంద్రరావు వాదించారు. ఈ వాదనలను పోలీసుల తరఫున వాదించిన అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వ్యతిరేకించారు. బండి సెల్‌ఫోన్ నుంచి పదో తరగతి పేపర్ పలువురికి చేరింది. విద్యార్థుల్లో ఆత్మస్తైర్యం దెబ్బతినేలా చేశారు. కుట్రకు పాల్పడ్డారు. నింతులతో సంబంధాలు ఉన్నాయి. 'బండి సెల్‌ఫోన్ దొరికితే కీలక విషయాలు బయటకు వస్తాయి. సెల్‌ఫోన్ ఇవ్వలేదు. దర్యాప్తు ఇంకా జరగాలి. కాబట్టి రిమాండ్ రిపోర్టును రద్దు చేయాలన్న పిటిషన్‌ను డిస్మిస్ చేయండ'ి.. అని వాదించారు. వాదనల తర్వాత కోర్టు విచారణను 10కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, బండి సంజరుని కోర్టులో హాజరుపరిచేలా ఉత్తర్వులు ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్లో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ కార్తీక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.