Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులను ఆదేశించిన సీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో ఇదే అంశంపై ఆమె సీనియర్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లు ఘనంగా ఉండాలన్నారు. ప్రధాన వేదిక వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని రోడ్డు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, ఆవరణ వద్ద సుందరీకరణ, మొబైల్ టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. కార్యక్రమానికి లక్ష మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖ ఆధికారులను కోరారు. అగ్నిమాపక శాఖ సంబంధిత ఏర్పాట్లు చూసుకోవాలని ఆదేశించారు. వేసవి కాలం దృష్ట్యా తాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్దంగా ఉంచాలని, అత్యవసర వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. పార్కింగ్, ప్రాంగణం వద్ద ఇతర ఏర్పాట్లను, పటిష్టం చేయడానికి శుక్రవారం సంయుక్తంగా సందర్శించాలని, తగిన ఏర్పాట్లు చేయడానికి ఆర్అండ్బీ, పోలీస్, ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖ, హైదరాబాద్ కలెక్టర్, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.