Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త బోర్డును ఏర్పాటు చేయాలి
- అభ్యర్థికి రూ.ఒక లక్ష నష్టపరిహారం ఇవ్వాలి
- ప్రశ్నాపేపర్ల లీకేజీ నియంత్రణ చట్టాన్ని తేవాలి
- 18న నిరసన దీక్ష : అఖిలపక్ష నాయకుల వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలనీ, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలనీ, ఒక్కో అభ్యర్థికి రూ.ఒక లక్ష నష్టపరిహారం ఇవ్వాలనీ, ప్రశ్నాపేపర్ల లీకేజీ నియంత్రణ చట్టాన్ని తేవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్, బీయస్పీ, సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ, సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా, సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ, టీజేఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున కెటి రామారావు చేస్తున్న ప్రచారం సరికాదని తెలిపారు. పాలకుల అవినీతి, అసమర్థ వల్లనే పేపర్ లీకేజి జరుగుతున్నదని, అది పెద్దల అండదండలతో ఒక వ్యాపారంగా ఎదిగిందని ఆరోపించారు. విద్యార్థులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగుతుందనీ, ఏప్రిల్ 18న హైదరాబాద్‌లో 'నిరుద్యోగుల గోస - అఖిల పక్ష భరోసా - నిరసన దీక్ష' నిర్వహించాలని నిర్ణయించాము. లీకేజీ సమస్య పరిష్కారమయ్యేంత వరకు సంఘటితంగా పోరాటం చేస్తామని తెలిపారు.
ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రపతికి, గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి లేఖలు రాయనున్నట్టు తెలిపారు. బీయస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పేపర్ లీకేజీ విషయంలో కమిషన్ సభ్యులను పోలీసులు టచ్ చేయడం లేదని ఆరోపించారు. పదవ తరగతి పేపర్ లీక్ కంటే పెద్ద కుట్ర టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్‌లో జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ పోలీసులు అరెస్టులు చేసినా పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.