Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏసుక్రీస్తుకు శిలువ వేయబడిన రోజు (ఏప్రిల్7) 'గుడ్‌ఫ్రైడే' సందర్భంగా ప్రజల కోసం ఏసుక్రీస్తు చేసిన త్యాగాలను ఈసందర్భంగా సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. శిలువ మీద తన దేహానికి శీలలు కొడుతున్న వారిని సైతం క్షమించమంటూ ప్రార్ధించారని గుర్తు చేశారు. మహౌన్నత క్షమాగుణ సంపన్నులు ఏసుక్రీస్తు అని సీఎం కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 'గుడ్‌ఫ్రైడే' క్రైస్తవులకు పరమ పవిత్రమైన రోజని తెలిపారు. సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సాహాయుల పట్ల జాలి, అవధులు లేని త్యాగం, సడలని ఓర్పు, శత్రువుల పట్ల క్షమాగుణం అనే గొప్ప లక్షణాలను కలిగివుండడం కరుణామయుడైన ఏసుక్రీస్తుకే సాధ్యమైందని గుర్తుచేశారు. ఈ లక్షణాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాల్సిన అవసరమున్నదని పిలుపునిచ్చారు. మానవజాతికి శాంతి, సహనం, అహింస సౌభ్రాతృత్వాలను తన ఆచరణ ద్వారా క్రీస్తు సమస్త మానవాళికి సందేశమిచ్చారని తెలిపారు. విభేదాలు, తారతమ్యాలు లేకుండా మనుషులంతా ఒక్కటిగా కలిసి ఉండేందుకు ఏసుక్రీస్తు బోధనలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గుడ్‌ఫ్రైడేను ప్రజలు దైవ ప్రార్థనలతో జరుపుకోవాలనీ, ప్రజల మధ్య శాంతి, సామరస్యం విలసిల్లాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.