Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి గనులపై కుట్ర
- బొగ్గుగనులను ప్రయివేటీకరించబోమని ఇదే గడ్డపై ప్రకటన
- తాజాగా వేలంలో తెలంగాణలోని నాలుగు గనులు
- రూ.కోట్లు ఖర్చుచేసి ఆ గనులను గుర్తించిన సింగరేణి సంస్థ
- ఆ సంస్థను కాదని వేలం వేస్తున్న కేంద్ర సర్కార్
- భగ్గుమంటున్న కార్మిక లోకం
- సింగరేణి ఊపిరి తీస్తే సహించబోమంటూ హెచ్చరిక
- నేడు రాష్ట్రంలోని బొగ్గుగనుల్లో ఆందోళనలు, మహాధర్నాకు పిలుపు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / సింగరేణి ప్రతినిధి
సింగరేణి సంస్థ.. 134ఏండ్ల చరిత్ర ఉన్న సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు పెద్ద కుట్రకే తెరలేపింది. గతేడాది నవంబర్‌లో రామగుండం వచ్చిన మోడీ.. సింగరేణి సంస్థలో రాష్ట్రానికే 51శాతం వాటా ఉందని, ఇక్కడి బొగ్గు గనులను కేంద్రం ఎలా ప్రయివేటీకరిస్తుందని ప్రశ్నించారు. ఇప్పుడవి పచ్చి అబద్ధాలని తేలింది. కేంద్ర గనుల శాఖ విడుదల చేసిన బొగ్గుగనుల వేలం నోటిషికేషన్ తాజా ఉదాహరణ. తన అనుంగు మిత్రులైన బడా కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అప్పగించేందుకు రాష్ట్రంలోని నాలుగు బొగ్గుగనుల వేలం వేయబోతుంది. ఈ నేపథ్యంలో రామగుండం పర్యటన తరువాత శనివారం హైదరాబాద్‌కు ప్రధాని వస్తున్న సందర్భంగా పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు, మహాధర్నా నిర్వహించేందుకు కార్మిక సంఘాలు, వామపక్షాలు, బీఆర్ఎస్ పిలుపునిచ్చాయి.
చెప్పేదొకటి.. చేసేదొకటి..
గతేడాది నవంబర్‌లో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించిన ప్రధాని మోడీ సింగరేణి ప్రయివేటీకరణ చేయబోమని చెప్పారు. సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర సర్కారుకే ఉందని, వేలం వేసేందుకు తమకు హక్కు లేదని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో విదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతోనే సంస్కరణలు చేపడుతున్నట్టు ప్రకటించిన మోడీ దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి భారీగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పుడేమో సింగరేణి గనులను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు తెరదీశారు. అందులోనూ రూ.కోట్లు ఖర్చు చేసి సత్తుపల్లి, పెనుగడప, శ్రావణపల్లి, కళ్యాణ్ ఖని బొగ్గు బ్లాకులను గుర్తించిన సింగరేణి సంస్థను కాదని వాటిని వేలం వేసి ప్రయివేటుకు అప్పగించేందుకు కేంద్ర గనుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సింగరేణి వ్యాప్తంగా నేడు ఆందోళనలు
ప్రధాని మోడీ చేసిన పచ్చి అబద్ధాలను నిలదీస్తూ, సింగరేణి సంస్థ పరిరక్షణకు బీఆర్ఎస్, వామపక్షాలు, కార్మికలోకమంతా ఆందోళనకు సిద్ధమయ్యాయి. నేడు ప్రధాని హైదరాబాద్ పర్యటనలో భాగంగా సింగరేణి పరిధిలోని కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున నిరసన పోరాటాలకు సంసిద్ధం కావాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ సహా కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చా యి. మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం ఏరియాల్లో మహా ధర్నాలు చేపడుతున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సీపీఐ(ఎం) నేత తమ్మినేని వీరభద్రం రాష్ట్ర వ్యాపిత నిరసనలకు పిలుపునిచ్చా రు. గనుల కేటాయింపులో గుజరాత్ ప్రభుత్వానికి కల్పించిన వెసులుబాటు మాదిరిగానే తెలంగాణలోని సింగరేణి గనులకు కూడా అమలు చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగర్ల మల్లయ్య డిమాండ్ చేశారు.
సింగరేణి బ్లాక్‌ల వేలం ఎప్పటి నుంచో...
గతంలో 2021 అక్టోబర్ 13న తెలంగాణలోని నాలుగు బ్లాక్‌లకు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ వేలం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో కొయ్యగూడెం బ్లాక్ -3ని ఆరో కోల్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి 2022 అక్టోబర్ 14న కేటాయించారు. అయితే, ఈ కేటాయింపును 2023 మార్చి 13న నిలిపివేశారు. 2021 డిసెంబర్ 16న, 2022 మార్చి 30న కూడా మళ్లీ అవే నాలుగు బ్లాక్‌లకు వేలం వేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చారు. అప్పుడు వేలానికి సరైన కోట్ ఎవరూ చేయకపోవడవంతో వేలం నిలిపివేశారు. తరువాత 2022 నవంబర్ 2న ఇచ్చిన నోటిఫికేషన్లో పెనగడప, కళ్యాణ్ఖని బ్లాక్-6, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి గనులకు వేలానికి పిలవగా.. సత్తుపల్లి బ్లాక్ -3కి ఒక్కరే కోట్ చేశారు. అప్పుడూ వేలం నిలిచిపోయింది. తాజాగా గత నెల మార్చి 29న రెండు నోటిఫికేషన్లను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విడుదల చేశారు. అందులో సత్తుపల్లి, శ్రావణపల్లి, పెనగడప బ్లాక్‌లు ఉన్నాయి. ఇప్పుడు దీనిపైనే రాష్ట్ర సర్కారు, వామపక్ష పార్టీలు, సింగరేణి కార్మికలోకం భగ్గుమంటోంది.
మోడీ కుట్రలను అడ్డుకుంటాం : సీఐటీయూ
ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్మికుల జీవితాలను కష్టాల్లోకి నెట్టివేసే ప్రధాని కుట్రలను అడ్డుకుంటామని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు తెలిపారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం ద్వారానే ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్రాంత ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.
కేంద్రంపై జంగ్‌సైరన్
- కోరుకంటి చందర్- రామగుండం ఎమ్మెల్యే
సింగరేణి ప్రయివేటీకరణ కుట్రలపై.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై జంగ్ సైరన్ పూరించాం. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 'మహాధర్నా' నిర్వహించనున్నాం. ఇందులో పెద్దఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలి.
అటకెక్కిన విభజన హామీలు
- తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో 10వ అంశం కింద స్పష్టంగా ఉంది. అయితే, ఆ కోచ్‌ఫ్యాక్టరీని మహారాష్ట్రకు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపింది.
- బయ్యారంలో 'సెయిల్' ఆధ్వర్యంలో రూ.36వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీ
నిర్మిస్తామని విభజన చట్టంలో పేర్కొన్నా.. నిర్మాణానికి కనీస చర్యలు తీసుకోలేదు.
- తెలంగాణాలో దాదాపు 12శాతం జనాభా ఉన్న గిరిజనుల కోసం రాష్ట్రంలో
ప్రత్యేక గిరిజన వర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి చేతులు దులుపుకుంది. ఏపీకి మంజూరు చేసింది.
- ఏపీలోని పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలోనూ ఒక సాగునీటి ప్రాజెక్టుకు
జాతీయ హోదా ఇస్తామని మాట ఇచ్చిన కేంద్రం కనీసం కాళేశ్వరం లేదా పాలమూరు-
రంగారెడ్డి ప్రాజెక్టుల్లో దేనికీ ఇవ్వకుండా మొఖం చాటేసింది.
- విభజన సమయంలో షెడ్యూల్ 9, 10లో చేర్చిన ఉమ్మడి ఆస్తుల
విభజన ఇప్పటికీ కొలిక్కి తీసుకురాలేదు. పైగా ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టి చోద్యం చూస్తోంది.
- జిల్లాకో నవోదయ విద్యాలయం, నిజామాబాద్‌లో పసుపు బోర్డు కలగానే మారింది. కనీసం తెలంగాణకు ఒక్క కొత్త వైద్యశాలను ఇవ్వని కేంద్రం ఇటీవల ప్రకటించిన నర్సింగ్ కాలేజీల్లోనూ ఒక్కటి కూడా రాష్ట్రానికి కేటాయించలేదు. మరోవైపు హైదరాబాద్‌కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది.