Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు పూటలు అటెండెన్స్
- వేసవి భత్యానికి మంగళం
- గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కేంద్రం నిర్ణయం
- పనిభారంతో సొమ్మసిల్లుతున్న కూలీలు
- గతంలో లాగే కొనసాగించాలని డిమాండ్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. మండుటెండలో సైతం రెండు పూటలా పనులు చేయాల్సిందేనని ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. అలాగే, కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తేనే కూలి డబ్బులు చెల్లిస్తామని తేల్చి చెబుతోంది. వేసవి భత్యానికీ మంగళం పాడింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలతో ఉపాధి కూలీలు ఆందోళన చెందుతున్నారు.. కాగా, గతంలో లాగే ఉపాధి హామీని కొనసాగించాలని కూలీలు కోరుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిలాల్లో 2,65,352 జాబ్ కార్డులు ఉన్నాయి. 6,90,298 మంది కూలీలు ఉన్నారు. 5,30,294 మంది ఈ ఏడాది పనులకు వెళ్లారు. రంగారెడ్డి జిల్లాలో 1.65 లక్షల జాబ్ కార్డులు ఉండగా రెండు లక్షల మంది పనులకు వెళ్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 87వేల జాబ్‌కార్డులు ఉండగా నాలుగు లక్షల మంది కూలీలు ఉన్నారు. నిర్విరామంగా కూలి పనులకు వెళ్లే వారు లక్షా 20 వేల మంది ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పనులపై ఎక్కువగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గతేడాది వంద రోజుల ఉపాధి కల్పనలో రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కానీ ప్రస్తుతం ఉపాధి హామీ పనుల నిర్వహణ పూర్తిగా కేంద్రం తన ఆధీనంలోకి తీసుకున్నది. రోజుకో మార్పు తీసుకొచ్చి కూలీలపై పనిభారం పెంచుతోంది. వేసవి కాలంలో కూడా రెండు పూటలు పని చేయాలని, లేదంటే కూలి డబ్బులు రావంటూ ఆదేశాలు జారీ చేసింది.
వేసవి భత్యానికి మంగళం
ఎండాకాలంలో పనులు చేసే కూలీలకు వేసవి భత్యం కింద మూడు నెలల పాటు సగటున 25 శాతం వేతనం అదనంగా చెల్లించాలి. అయితే ఉపాధి పనులు పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి వెళ్లడంతో వేసవి భత్యం లేకుండా చేసింది. కూలీలు చేసిన పనిని కొలతలు ఆధారంగా లెక్కించి రోజుకు రూ.245 వేతనం చెల్లించాలి. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కష్టపడుతున్నా సగటు కూలి రూ.150 నుంచి రూ.190 మధ్యనే వస్తుంది. ప్రస్తుతం ఎండలు ఉండటంతో నేలలు గట్టిబారాయి. ఎంత కష్టపడినా వచ్చే డబ్బులు గిట్టుబాటు కావడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు.
రెండు పూటలా అటెండెన్స్
ఉపాధి పనులు వేసవి కాలంలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు జరుగుతుండేవి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జాబ్ కార్డు ఉన్న కూలీల కుటుంబాల వారికి కేటాయించిన వంద రోజుల పని దినాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధిగా పనులకు హాజరు కావాలి. ఎంత మంది పనులకు వచ్చారనే విషయాన్ని ఉపాధి హామీ మేట్లు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం మరోసారి మాస్టర్‌లో నమోదు చేయాలి. ఇప్పటికే స్థానికంగా పనులు లేక కొన్ని గ్రామాల్లోని కూలీలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. రెండు పూటలా పని విధానంతో గ్రామం నుంచి పని ప్రదేశాలకు సుమారు రెండు, మూడు కిలోమీటర్లు రెండుసార్లు తిరగలేక కూలీలు పని ప్రదేశంలోనే ఉండాల్సి వస్తుంది. ఉదయం ఉపాధి పనుల్లో ఉంటూ.. మధ్యాహ్నం నుంచి వ్యవసాయ పనులు, పశువును మేపడానికి వెళ్లేవారు.
ఇప్పుడు ఆ అవకాశం ఉండదని కూలీలు వాపోతున్నారు. కేంద్రం కొత్తగా ఇచ్చిన ఈ నిబంధనలను రద్దు చేయాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర నిబంధనలు పాటిస్తున్నాం
ఉపాధి హామీ పనులు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఇక నుంచి రెండు పూటలా పని చేయాలి. అప్పుడే కూలీల ఖాతాల్లో పూర్తి వేతనం జమ అవుతుంది. భవిష్యత్తులో కూలీల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
- ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా డీఆర్డీఏ పీడీ