Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పర్యటనను నిరసిద్దాం : తమ్మినేని
- నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వ్యతిరేకంగా శనివారం చేపట్టబోయే రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణకు వివిధ సందర్భాల్లో చేసిన వాగ్దానాలు, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన హక్కులు, వాటాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరాకరిస్తు న్నదని విమర్శించారు. వాటిని నిర్లక్ష్యం చేస్తూ, వివక్షను ప్రదర్శిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నదని తెలిపారు. సింగరేణి వంటి సంస్థలను పూర్తిగా ప్రయివేటీకరించడానికి పూనుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా సింగరేణిలో మరోసారి బొగ్గుగనుల వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రపన్నుతున్నదని తెలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన, హార్టికల్చర్ విశ్వవిద్యాలయా లు, ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి విభజన చట్టంలో హామీల అమలు ఊసే ఎత్తడంలేదని విమర్శించారు. యూపీఏ హయాంలో మంజూరైన ఐటీఐఆర్‌ను రద్దుచేసిందని తెలిపారు. కృష్ణా నదీజలాల పంపిణీ పంచాయితీపై రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటుచేసి రెండు నదులను తన పరిధిలోకి కేంద్రం లాక్కుందని పేర్కొన్నారు. గిరిజన, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శనివారం తెలంగాణకు రావడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.