Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు : పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజను కూడా వదులుకోమని, ఒక్క రూపాయి కూడా పోనివ్వబోమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారంనాడిక్కడి మంత్రి నివాసంలో పౌరసరఫరాల శాఖపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అక్రమాలు చేస్తున్న డిఫాల్ట్ మిల్లర్లు అధికంగా సూర్యాపేట, నల్గొండ, వనపర్తి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఉన్నారనీ, వీరిని కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ రిటైర్డ్ పోలీస్, రెవెన్యూ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం అమ్ముకునే మిల్లర్లను, రేషన్ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి, సమాచారం అందించే పౌరులకు రివార్డులు అందజేస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు. డిఫాల్ట్ మిల్లర్లు, అక్రమార్కులను ఉపేక్షించేది లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుంచి 90 శాతం రికవరీ చేసామనీ, మిగతా పది శాతం కూడా రికవరీ చేస్తామన్నారు. దీనిపై కలెక్టర్లు దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.