Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జారీ చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ మూల్యాంకనం కేంద్రాల వద్ద కాంట్రాక్టు అధ్యాపకుల మౌనఆవేదన కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామంటూ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఈనెల ఏడో తేదీ దాటినా ఆ ఉత్తర్వులు ఇంకా రాకపోవడంతో కాంట్రాక్టు అధ్యాపకులు తీవ్ర మానసిక ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తక్షణమే జోక్యం చేసుకుని క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ అయ్యేటట్టు చూడాలని కోరారు. ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణ అధికారి (సీవోఈ) జయప్రదభారుతోపాటు మూల్యాంకనం కేంద్రాల వద్ద క్యాంపు అధికారులను కలిసి వినతిపత్రాలను సమర్పించామని పేర్కొన్నారు. మొదటిరోజు మౌనఆవేదన కార్యక్రమం విజయవంతమైందని, ఈనెల 11వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు.