Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజుకు బైక్ రూ.425, కారు రూ.525
- మోడీజీ... జర దేఖోజీ పేరుతో పీవైఎల్ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పార్కింగ్ దోపిడీని అరికట్టాలని పీవైఎల్ డిమాండ్ చేసింది. ఒకరోజు బైక్ పార్కింగ్‌కి రూ.425, కారు పార్కింగ్‌కి రూ.525 వసూలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. మోడీజీ... జర దేఖోజీ అంటూ శుక్రవారం హైదరాబాద్‌లో పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రదీప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రధాని మోడీ శనివారం వందే భారత్ రైలును ప్రారంభించేందుకు వస్తున్నారని చెప్పారు. పార్కింగ్ ఫీజులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. పార్కింగ్‌ను ప్రయివేటు పరం చేయడం వల్లే ప్రయాణికులు నిలువుదోపిడీకి గురవుతున్నారని విమర్శించారు. పదో నెంబర్ ఫ్లాట్ ఫాం వైపు ఏదైనా వాహనానికి ఎనిమిది నిమిషాల వరకు ఉచితం, ఆలోపు తిరిగి రాకపోతే 15 నిమిషాలకి రూ.100, ఆ తర్వాత 30 నిమిషాలకి రూ.200, ఆ సమయం దాటితే రూ.500 వరకు దారుణంగా వసూల్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వందే భారత్ రైలు చార్జీలు, పార్కింగ్ చార్జీలు సాధారణ ప్రజలు భరించే స్థాయిలో లేవని వివరించారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా చార్జీలుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర నాయకులు భూషణవేణి కృష్ణ, రవి కుమార్, కృష్ణ, ఆంజనేయులు, గణేష్, వినరు, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.