Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదెకరాల్లో పూలే నాలెడ్జ్ సెంటర్ నిర్మించాలి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవి.రమణ
- ఇందిరాపార్కు వద్ద పూలే దంపతుల విగ్రహ సాధన దీక్ష
నవతెలంగాణ - అడిక్ మెట్
దేశంలో విద్యా విప్లవం సృష్టించిన పూలే దంపతుల విగ్రహాలను ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవి.రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదెకరాల్లో పూలే నాలెడ్జ్ సెంటర్ నిర్మించాలని కోరారు. శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే దంపతుల విగ్రహ సాధన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఎంవీ రమణ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు సమానత్వం కోసం, మూధనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అని అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండటానికి ఆ దంపతుల విగ్రహాలను ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని కోరారు. మహిళలను వంటింటి బానిసగా చూసే రోజుల్లో తన భార్య సావిత్రిబాయి పూలేకు స్వయాన జ్యోతిరావు పూలే చదువు బోధించారని చెప్పారు. తద్వారా ఆమె ఇతర మహిళలకు విద్యాబోధన చేసే విధంగా ప్రోత్సహించారని తెలిపారు. అటువంటి మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను జాతర వలె జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు అక్షరాభ్యాసం చదువుల తల్లి కోవెలలో చేయించే విధంగా పూలే నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. దేశంలో విద్యా విప్లవం తీసుకొచ్చిన గొప్ప సంఘ సేవకులు పూలే దంపతులు అని కొనియాడారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పూలే జయంతి కార్యక్రమాల సందర్భంగా వారి విగ్రహాల ఏర్పాటుపై మంత్రులు హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయడం లేదన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు హర్షించదగ్గ విషయమన్నారు. అంబేద్కర్ స్వయాన పూలే తన గురువు అని చెప్పారని గుర్తు చేశారు. ఈ నెల 11న పూలే జయంతి వేడుకల్లో విగ్రహ ఏర్పాటుపై ప్రకటన చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల మల్లేష్, గాయకురాలు విమలక్క, బీసీ సంఘాల జేఏసీ చైర్మెన్ కుందారపు గణేష్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, నాయకులు ఇందిరా శోభన్ పాల్గొన్నారు.