Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కార్మికుల్లో ఆందోళన
- నేటి ఆందోళనలను జయప్రదం చేయండి : బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన కార్మికుల్లో ఆందోళన నెలకొందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర చర్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించతలపెట్టి ఆందోళనలను జయప్రదం చేయాలని ఆయన ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. సింగరేణిని ప్రయివేటీకరించబోమంటూ చెబుతున్న కేంద్రం... బొగ్గు బ్లాకులను ఎందుకు వేలానికి పెట్టిందంటూ మంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు. వాటిని ఆ సంస్థకే ఎందుకు ఇవ్వటం లేదని నిలదీశారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు యత్నించటం శోచనీయమని అన్నారు. గతంలో రామగుండంలో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోడీ...ఆ సంస్థను ప్రయివేటీకరించబోమంటూ హామీనిచ్చారని గుర్తు చేశారు. ఆయన ఆ వాగ్దానాన్ని విస్మరించి, బొగ్గు బ్లాకుల వేలానికి తెర తీశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి మోడీపై ఒత్తిడి తేవటం ద్వారా బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని కోరారు.లేదంటే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎర్రబెల్లి హెచ్చరించారు.