Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కేసులు పెరుగుతున్నదృష్ట్యా...
- కేంద్రానికి మంత్రి హరీశ్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా కట్టడిలో అతి ముఖ్యమైన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టు స్పష్టమైంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, వ్యాక్సిన్ సరఫరాలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తున్నది. తమకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కోరిన పలు రాష్ట్రాల మంత్రులకు వ్యాక్సిన్ సరఫరా చేసేది లేదనీ, సొంతంగా కొనుగోలు చేసుకోవాలని సూచించింది. దీంతో వ్యాక్సిన్ సరఫరాపై కేంద్రం చేతులెత్తేసినట్టయింది. శుక్రవారం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులు, సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్, అప్రాప్రియేట్ బిహేవియర్ వంటి ఐదంచెల వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడుతూ కరోనా కట్టడిలో, వ్యాక్సినేషన్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా పరిస్థితులు రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయనీ, ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ప్రికాషనరీ డోసుల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్టు చెప్పారు. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవటంతో నిల్వలు లేకుండా పోయినట్టు చెప్పారు. దీంతో వ్యాక్సినేషన్ నిలిచిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్ డోసులను తక్షణం సరఫరా చేయాలని కోరారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్టు గుర్తు చేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం తమకు వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయిందనీ, దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలుగుతున్నట్టు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ మాట్లాడుతూ.. కావల్సిన వ్యాక్సిన్లు ఆయా రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చని, బహిరంగా మార్కెట్లో పుష్కలంగా నిల్వలు ఉన్నాయని చెప్పారు.మరోవైపు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా హైదరాబాద్ ఫార్మా సంస్థ బయోలాజికల్ సహకారంతో 15 లక్షల డోసులు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన బయోలాజికల్ ఇఎండీ మహిమా ధాట్లకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ధన్య వాదాలు తెలిపారు.