Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న మోడీ
- రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు మూడున్నర గంటలు తగ్గించనుంది. ఇది తెలుగు రాష్ట్రాల యాత్రికులు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్దీకరణను జాతికి అంకితం చేయనున్నారు. హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాల సబర్బన్ విభాగంలో 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రారంభిస్తారు. మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ (ఎంఎంటీఏస్) జంట నగర ప్రాంతంలోని ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనుంది. కొత్త రైలు సేవలు జంట నగరాల్లోని పలు కొత్త ప్రాంతాలకు ఈ సేవలను అందించడం వల్ల రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, కార్యాలయానికి వెళ్లే వారికి అతి తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యం కలగనుంది. రూ.1,410 కోట్ల నిధులతో చేపట్టిన సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ ప్రాజెక్టు దాదాపు రూ.85.24 కిలోమీటర్లు మేర పూర్తయ్యింది. ఈ ప్రాజెక్ట్‌లో తొమ్మిది ప్రధాన వంతెనలు, 152 చిన్న వంతెనలు, రహదారి వినియోగదారుల భద్రత, రైలు నిర్వహణ కోసం 17 లెవెల్ క్రాసింగ్ గేట్లను తొలగించారు. ప్రాజెక్ట్ పూర్తి చేయడం వల్ల ప్యాసింజర్, ఫియట్ రైళ్లు రెండింటినీ ప్రవేశపెట్టే అవకాశం పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు అవాంతరాల్లేని కనెక్టివిటీని అందిస్తుంది. రైళ్ల సగటు వేగాన్ని పెంచడంలో సహాయపడుతుంది. వాటితోపాటు రూ.720 కోట్ల నిధులతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను చేపట్టనున్నారు. రాష్ట్రంలోని ప్రయాణికుల రాకపోకల పరంగా అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా ఉన్న ఇది ప్రఖ్యాతిగాంచింది. దీన్ని ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సుందరంగా విశిష్ట గుర్తింపు పొందేలా స్టేషన్ భవనంలో భారీ ఎత్తున మార్పులు చేపట్టనున్నారు. ఈ స్టేషన్లో విశాలమైన డబుల్-లెవల్ రూఫ్ ప్లాజాతోపాటు రిటైల్ షాపులు, ఫలహారశాలలు, వినోద సౌకర్యాలు, ప్రయాణికుల రాక/నిష్క్రమణలు వేర్వేరుగా, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ట్రావెలేటర్లు, మల్టీలెవల్ కార్ పార్కింగ్ వంటి ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నారు. రైలు ఎక్కాల్సిన, దిగాల్సిన ప్రయాణికులకు అంతరాయం లేకుండా ఇతర రవాణా మార్గాలతో మల్టీమోడల్ కనెక్టివిటీని ఆధునీకరణ పనులు అందించనున్నాయి. ఈ విషయాలన్నింటినీ పేర్కొంటూ దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.