Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్ టెర్రరిస్టు కంటే ప్రమాదం
- పార్లమెంట్ చరిత్రలో ఇవి చీకటి రోజులు
- లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
- సమిష్టిగా వామపక్ష కార్యాచరణ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ- ఖమ్మం
రాష్ట్రం పట్ల వివక్షత చూపుతూ తెలంగాణ సిరులతల్లిగా పేరొందిన సింగరేణిని ప్రయివేటీకరణ చేసేందుకు యత్నిస్తున్న ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బొగ్గుగనులను ప్రయివేటీకరణ చేస్తున్న మోడీ.. బీహార్, జార్ఘండ్ తదితర రాష్ట్రాల్లో బొగ్గు నిక్షేపాలను కోలిండియాకు అప్పగించారని ఆరోపించారు. విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకపోగా ప్రధాని స్థాయిలో మోడీ అబద్దాలు చెబుతున్నారని తెలిపారు. కోయగూడెం ఓసీని అరవిందో కంపెనీకి అప్పగించారని తెలిపారు. గతంలో మోడీ వచ్చినప్పుడు సైతం రాష్ట్ర సమస్యలను పరిష్కారించాలని ర్యాలీ నిర్వహిం చామని, అయినా పట్టించుకోలేదని, రాష్ట్రానికి ఒక ఐఏఎం, ఐఐటీ, మెడికల్ కాలేజీ ఇవ్వని మోడీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాపి తంగా కార్యక్రమాలను చేపడతామన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరు పార్లమెంట్ చరిత్రలోనే చీకటిరోజులని తెలిపారు. అదానీ రూ.13 లక్షల కోట్ల కుంభకోణానికి సంబంధించి ప్రతిపక్షాలు నిలదీయడంతోపాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు డిమాండ్ చేస్తుంటే దానికి సమాధానం చెప్పకపోగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ టెర్రరిస్టు కంటే ప్రమాదమని, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేందుకు ప్రయత్నించిన ఆయనపై కఠినచర్యలు తీసుకోవాలని తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి చైర్మెన్ జనార్ధన్‌రెడ్డిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మొత్తం లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులేనని తెలిపారు. రాష్ట్రవ్యాపితంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ జీఓ నెంబర్ 58 ద్వారా రెగ్యులరైజ్ చేసి పట్టాలివ్వాలని, ఇంటికి రూ.5 లక్షలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి రంగాలపై దృష్టి సారించాలన్నారు. వామపక్ష సమిష్టి కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు. భవిష్యత్‌లో ఐక్యతను మరింత పెంపొందించేందుకు క్షేత్రస్థాయి వరకు సమావేశాలు నిర్వహిస్తామని, సంయుక్తంగా ఈనెల 9న హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఐ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోట ప్రసాద్, రాష్ట్ర సమితి సభ్యులు జితేందర్ రెడ్డి, ఎస్.కె.జానిమియా తదితరులు పాల్గొన్నారు.