Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన ప్యానెల్
- కమిటీలో నలుగురు సభ్యులు
- కాల పరిమితి పెట్టకపోవడంపై ఉద్యోగ సంఘాల అభ్యంతరం
- ఓపీఎస్ పునరుద్ధరించాలని దేశవ్యాప్త ఆందోళనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)పై కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ వ్యవస్థను సమీక్షించడానికి ఒక ప్యానెల్‌ను ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల సమర్పణకు కాలపరిమితిని నిర్ణయించలేదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రస్తుత ఫ్రేమ్‌వర్క్, నిర్మాణాన్ని బట్టి ఏవైనా మార్పులు అవసరమా? అని కమిటీ సూచిస్తుంది. ఎన్పీఎస్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో కమిటీ మార్పులను సూచిస్తుందనీ, సాధారణ పౌరులను రక్షించడానికి ఆర్థిక వివేకం ఉండేలా చూసుకోవాలని కేంద్ర వ్యయ విభాగం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం తెలిపింది. సోమనాథన్ అధ్యక్షతన ఉండే కమిటీలో కేంద్ర ప్రజా ఫిర్యాదులు, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఒపిటి) కార్యదర్శి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖక సంబంధించిన వ్యయ విభాగం ప్రత్యేక కార్యదర్శి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మెన్ (పీఎఫ్ఆర్డీఏ) సభ్యులుగా ఉంటారు.ఓపీఎస్, ఎన్పీఎస్ మధ్య వివాదం రాజకీయ అంశంగా మారింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు ప్రయోజనాలను అందించే పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)కి తిరిగి వచ్చాయి. వాస్తవానికి, గత నెలలో మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వం కూడా ఎన్పీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు ఓపీఎస్ ప్రయోజనాలను వర్తింపజేయడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకంలో తన వాటాను 14 శాతం నుంచి 20 శాతం పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పథకానికి ఉద్యోగుల వాటా 10 శాతం కాగా, ప్రభుత్వ వాటా 14 శాతంగా ఉంది. 2004 జనవరి తరువాత సర్వీస్‌లో చేరిన ఉద్యోగులను కవర్ చేసే ఎన్పీఎస్ కింద, కాంట్రిబ్యూషన్లు నిర్వచించబడ్డాయి. అయితే ఉద్యోగుల ప్రయోజనాలు మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. 2004 జనవరి 1 తరువాత రిక్రూట్ అయిన తమ ఉద్యోగులకు సంబంధించి ఓపీఎస్‌ని పునరుద్ధరించే ప్రతిపాదన ఏదీ పరిశీలించడం లేదని ఇటీవలి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది.
2003 డిసెంబర్లో ఎన్పీఎస్ నోటిఫికేషన్‌కు ముందు ప్రకటించబడిన పోస్ట్‌లను ఓపీఎస్‌కి మార్చడానికి, ప్రభుత్వ ఉద్యోగులలో ఒక విభాగానికి మారడానికి కేంద్రం వన్-టైమ్ ఆప్షన్‌ను అనుమతించింది. ఓపీఎస్ కింద, పదవీ విరమణ ప్రభుత్వ ఉద్యోగులు వారి చివరి డ్రాలో 50 శాతం పొందుతారు. నెలవారీ పెన్షన్‌గా జీతం, డియర్నెస్ అలవెన్స్ రేట్ల పెంపుతో మొత్తం పెరుగుతూనే ఉంది. సాయుధ బలగాలు మినహా కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి 1 నుండి ఎన్‌పీఎస్‌ని ప్రవేశపెట్టింది. అధిక పెన్షన్ చెల్లింపులు ఖజానాపై భారాన్ని పెంచుతాయనీ, ఆర్థికపరమైన చిక్కులను కలిగి ఉంటాయని తెలిపింది. ఇది ఇటీవల సుప్రీంకోర్టులో వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌కు సంబంధించిన విచారణలో ప్రభుత్వమే ఎత్తి చూపింది. రాష్ట్రాలు తమ ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయనీ, ఓపీఎస్‌కి తిరిగి రావద్దని జనవరిలో ఆర్బీఐ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఓపీఎస్, ఎన్పీఎస్ అంశాలను మిళితం చేసే గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) నమూనాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
కాల పరిమితి విధించకపోవడంతో ఉద్యోగ సంఘాలు అభ్యంతరం
కమిటీకి నిర్ణీత కాలపరిమితి విధించకపోవడంతో ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కమిటీ పేరుతో తమ డిమాండ్లను మరింత కాలయాపన చేసేందుకేనని విమర్శిస్తున్నాయి. ఇది కూడా కంటి తుడుపు చర్యేనని స్పష్టం చేశాయి. ఉద్యోగులను మోసం చేయొద్దనీ, మోసం చేయాలని చూస్తే తగిన పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఎన్పీఎస్ రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని దేశ రాజధాని ఢిల్లీలోనూ, రాష్ట్రాల్లోనూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవలి ఢిల్లీలో ఎస్టిఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పార్లమెంట్ మార్చ్ నిర్వహించారు. బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిఈఎఫ్ఐ) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన జరిగింది.