Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వింటాళ్ల కొద్దీ పత్తి నిల్వలు
- గిట్టుబాటు కాని ధరతో కౌలురైతుల దీనావస్థ
- అప్పులు, చేబదుళ్లతో నెట్టకొస్తున్న అన్నదాత
- రోజురోజుకు పడిపోతున్న పత్తి రేట్లు
- కౌలు అడుగుతున్న భూ యజమానులు
- కేంద్రం సీసీఐతో కొనిపించాలని డిమాండ్
- రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి
(పమ్మి నుంచి కె.శ్రీనివాసరెడ్డి / ఆవుల రామారావు)
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మి గ్రామంలో 'నవతెలంగాణ' శుక్రవారం పర్యటించినప్పుడు పత్తి రైతుల దీనావస్థలు మామూలుగా లేవు. ఏ రైతును కదిలించినా ధర లేకుంటే బయట పడేదెట్ట అని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 'ఉగాది పోయి పక్షం రోజులైంది. పోయినేడు డబ్బులు కడితే.. కౌలు కాగితం తిరగరాసుకుందాం..' అని భూ యజమానులు కౌలురైతులకు కబురు పెడుతున్నారు. కౌలు రైతులు అందుకు సుముఖంగా లేరు. ఆశించిన ధరలు లేక క్వింటాళ్ల కొద్దీ పత్తి నిల్వలు ఇండ్లలోనే ఉండడంతో ఏమి చేయగలమని కన్నీరుమున్నీరవుతున్నారు. కొంతమంది పట్టేదారులు బాగా ఒత్తిడి చేస్తుండటంతో కౌలుదారులతో విభేదాలు, స్పర్థలు చోటుచేసుకుంటున్నాయి. 'పత్తికి ఆశించిన ధర లేదు.. కండ్ల ముందే కనబడుతోంది.. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి.. ఇట్లనే ఇబ్బంది పెడితే వచ్చే ఏడాది కౌలుకు ఇవ్వకపోయినా ఫర్వాలేదా' అని కొందరు కౌలుదారులు భూ యజమానులను అడుగుతున్నారు. మరికొందరు నెల రోజుల సమయం పెట్టి.. ఎంతో కొంత తగ్గించాలని ప్రాధేయపడుతున్న ఉదంతాలు పల్లెల్లో కనిపిస్తున్నాయి. ప్రతియేటా జనవరి,ఫిబ్రవరి నెలల నాటికి పత్తి తీతలు పూర్తి చేసి ఆ పంటను తొలగించేవారు.అమ్ముకునేవారు.వాటిని రబీ(యాసంగి) కింద మొక్కజొన్న, వరి, పెసర సాగు పెట్టుబడులకు ఉపయోగించేవారు. ఇప్పుడు పత్తి అమ్ముడుపోక తిరిగి అప్పు, చేబదుళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉత్పన్నమైంది. దీనికి పెట్టుబడి పంటగా భావించే పత్తి ధరల పతనమే ప్రధాన కారణంగా రైతులు చెబుతున్నారు.
ధరలేదు.. దిగుబడి రాలేదు..
ఖమ్మం జిల్లాలో పత్తి అధికంగా సేద్యం చేసే మండలాల్లో ముదిగొండ ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల ఎకరాల వరకు పత్తి సాగు చేస్తే ముదిగొండలో 40వేల ఎకరాల వరకు ఈ పంట వేస్తుంటారు. మండలంలోని పమ్మి రెవెన్యూలో 500 మంది రైతులు మూడు వేల ఎకరాల్లో పత్తి సేద్యం చేశారు. వీరిలో 300 మందికి పైగా కౌలుదారులే ఉన్నారు. ఖరీఫ్‌లో పత్తి వేసి, రబీలో ఆ పంటను తొలగించి మొక్కజొన్న సాగు చేస్తుంటారు.
సాధారణంగా 8 క్వింటాళ్ల వరకు వచ్చే దిగుబడి ఈ ఏడాది నాలుగు క్వింటాళ్లలోపే వచ్చింది. క్వింటాకు రూ.12వేలకు పైగా ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతుండగా ఈ ఏడాది ఆరంభంలో రూ.8వేలకు పైచిలుకు రేట్లు పలికాయి. ఆ ధర మరింత పెరుగుతుందని ఆశ పడిన రైతులు పంటను నిల్వ చేసుకున్నారు. కానీ రోజురోజుకు ధరలు పడిపోయాయి. ప్రస్తుతం రూ.6వేల వరకే పలుకుతోం ది. ఫలితంగా ఇంటింటా పత్తి నిల్వలు పేరుకున్నాయి. కాయలు కుళ్లిపోయాయి. ఎక్కువకాలం నిల్వ చేయడంతో మకెర పురుగుల ఉధృతి అధికమైంది. ఈ పురుగుల వల్ల దురదలు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. ప్రతియేటా కౌలుకు తీసుకునే సమయంలో తొలుత సగం కౌలు భూ యజమానులకు చెల్లిస్తారు. ఆరుతడి పంటలు సాగు చేసే భూమికి ఎకరానికి రూ.20వేల చొప్పున కౌలు ఉంది. మాగాణైతే పది బస్తాల వడ్లు (రూ.15 నుంచి రూ.20వేలు) ఇవ్వాల్సి ఉంటుంది. ఉగాదికి కౌలు కాగితం తిరగరాస్తారు. కానీ ఈ ఏడాది మే నెలలో చెల్లిస్తామని రైతులు భూ యజమానులతో ఒప్పందం చేసుకుంటున్నారు. కొందరు ఒప్పుకుంటుండగా మరికొందరు అంగీకరించట్లేదు. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని కేంద్రప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రంగంలోకి దించి నిల్వ ఉన్న పత్తి మొత్తాన్ని రూ.8000 పైగా ధర పెట్టి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వమూ జోక్యం చేసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.
మా బతుకులెట్టా...
నేను ఐదు ఎకరాలు మెరక, ఐదు ఎకరాలు మాగాణి కౌలుకు తీసుకున్నా. పత్తికి బయట అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టా. ప్రతియేటా పత్తి తీతలు పూర్తి కాగానే దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో పెట్టుబడి పెట్టి మొక్కజొన్న వేస్తాం. ఈ ఏడాది పత్తి దిగుబడి ఆశించినంత లేదు.. ధరా బాగా తగ్గింది. పంట మొత్తం 15 క్వింటాళ్లకు పైగా ఇంట్లోనే ఉంది. బయట అప్పులు తెచ్చాం. వడ్డీలైనా పూడతాయనే ఆలోచనతో చేను దగ్గర పనిలేని రోజు.. నేను, మా ఆడమనిషి కూలికిపోతున్నాం. దానికితోడు మొన్నటి అకాల వర్షానికి రెండు ఎకరాల మొక్కజొన్న కూడా పనికిరాకుండా పోయింది. ఇటు పత్తికి ధర లేదు.. అటు మొక్కజొన్న పోయింది. కౌలు ఎట్టకట్టాలి.. అప్పులెలా తీర్చాలి.. మా బతుకులెట్టా వెళ్లాలో అర్థం కావట్లేదు.
- స్వామి, కౌలు రైతు
సీసీఐ ధర పెంచి కొనాలి
నేను ఐదు ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మొత్తం పత్తి సాగు చేశా. కౌలు కాకుండా.. ఒక పంటకే ఎకరానికి రూ.20వేలకు పైగా పెట్టుబడి పెట్టా. ఎకరానికి మూడు క్వింటాళ్ల చొప్పునే దిగుబడి వచ్చింది. పెట్టుబడి రూ.లక్షకు పైగా వచ్చింది. నూటికి రూ.2 చొప్పున వడ్డీకి తీసుకొచ్చా. ఇప్పుడున్న ధరకు పత్తి అమ్మితే ఎలా గిట్టుబాటు అవుతుంది. సీసీఐ రంగంలోకి దిగాలి. కనీసం రూ.8వేలకు పైగా ధర పెట్టి కొనుగోలు చేయాలి.
- చిన్నపంగు రంజిత్‌కుమార్, కౌలు రైతు