Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన హామీలు అమలు చేయని ప్రధాని
- రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న కేంద్రం : సీపీఐ(ఎం) నేతలు జి నాగయ్య, డిజి, జ్యోతి
- హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న 'ప్రధాని మోడీ గో బ్యాక్' అంటూ సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు నినదించారు. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ వరకు సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శనను నిర్వహించారు. 'తెలంగాణ విరోధి మోడీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడీ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలేవీ?, సింగరేణి ప్రయివేటీకరణను ఆపాలి, కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలి'అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు సీపీఐ(ఎం) నాయకులతో వాగ్వాదానికి దిగారు. షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు, టి జ్యోతి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు అవుతున్నా విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. మోడీ రాకను తెలంగాణ ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులివ్వలేదని విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా గుజరాత్లో ఇనుప ఖనిజాన్ని అదానీకి కట్టబెట్టారని అన్నారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అవసరం లేదంటూ మోసం చేస్తున్నారని చెప్పారు. గిరిజన వర్సిటీ అడ్రస్ లేదన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయని ప్రధాని, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రావడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. సింగరేణిని ప్రయివేటీకరించేందుకు కుట్ర పన్నుతున్నారని, అందుకే టెండర్లు పిలిచారని విమర్శించారు. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభించేందుకు వచ్చినపుడు సింగరేణిని ప్రయివేటీకరించేది లేదంటూ ప్రధాని హామీనిచ్చారని గుర్తు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచటంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక హక్కులను మోడీ కాలరాస్తున్నారని, ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న మోడీ ఈ తొమ్మిదేండ్లలో 18 కోట్ల మందికి ఉద్యోగాలివ్వాల్సి ఉందన్నారు. కానీ 18 లక్షల మందికి కూడా ఉద్యోగాలివ్వలేదని ఎద్దేవా చేశారు. ఇంకోవైపు ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తూ, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని చెప్పారు. ఎయిర్‌పోర్టులు, గనులు, సహజ వనరులను అదానీకి అప్పగిస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశాన్ని రిటైల్‌గా అమ్ముకుంటారని అన్నారు. నిరంకుశ విధానాలను అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బి రవికుమార్, ఆర్ శ్రీరాం నాయక్, టి స్కైలాబ్‌బాబు, జె బాబురావు, బి ప్రసాద్, ఎం అడివయ్య, నగర నాయకులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.