Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి రాష్ట్రం సహకరించట్లేదు
- అవినీతి, కుటుంబపాలన అభివృద్ధికి అవరోధాలు
- నాపై దాడికి అందరూ ఏకం అయ్యారు
- చట్టం తనపని తాను చేసుకుపోతుంది :సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ బహిరంగ సభలో ప్రధాని మోడీ
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అభివృద్ధి విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబపాలన కొనసాగుతున్నాయనీ, వాటి నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని చెప్పారు. శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించారు. అంతకుముందు ఆ రైలులో స్కూలు విద్యార్థులతో మాట్లాడారు. అక్కడే ఎమ్ఎమ్టీఎస్ ప్రత్యేక రైళ్లకు కూడా పచ్చజెండా ఊపారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. అక్కడి నుంచి వర్చువల్ (ఆన్లైన్)లో బీబీ నగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆ తర్వాత పలు జాతీయ రహదారుల నిర్మాణాలకు ఆన్లైన్లోనే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
నిజాయితీతో పనిచేసే వారంటే అవినీతిపరులకు భయమంటూ స్వీయకితాబునిచ్చు కున్నారు. హైదరాబాద్ అనే పదాన్ని ఉచ్ఛరించకుండా ''భాగ్యలక్ష్మి దేవాలయ నగరాన్ని వేంకటేశ్వరస్వామి నగరంతో కలిపాం'' అని చెప్పారు. ప్రియమైన సోదర, సోదరీమణులారా...అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత హిందీలో మాట్లాడారు. కరోనాతో పాటు రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ప్రపంచం తిరోగమనంలోకి వెళ్లిందనీ, భారతదేశం మాత్రం ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించా మన్నారు. రాష్ట్రంలో రూ.35 వేల కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ, నిర్మాణం చేపట్టామని చెప్పా రు. గడచిన తొమ్మిదేండ్లలో భారతదేశ రూపురేఖలు సమూలంగా మార్చేశామన్నారు. రాష్ట్రంలో ఏర్పాటైన భారీ టెక్స్టైల్ పార్క్‌తో రైతులు, కార్మికుల కు లబ్ది చేకూరుతుందన్నారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సేవలు విస్తరించా మనీ, ఒక్కరోజే 13 ఎంఎంటీఎస్ రైళ్లను అందు బాటులోకి తెచ్చామని తెలిపారు.
అలాగే సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ మధ్య రైల్వే డబ్లింగ్ పనులు పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తున్నట్టు చెప్పారు. జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తూ హైదరాబాద్ -బెంగళూరు నగరాలను అను సంధానం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభు త్వం ప్రగతి పనులు చేపడుతుంటే ఇక్కడి ప్రభుత్వా నికి బాధ కలుగుతున్నదని విమర్శించారు. తెలంగా ణలో 12 లక్షల మందికి ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా మన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదంతో మందుకెళ్తున్నామనీ, ఎంఎంటీఎస్ విస్తరణ కోసం రూ.600 కోట్లు కేటాయించామనీ అన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందనీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. తనపై దాడి చేసేందుకు వారంతా (ప్రతి పక్షాలు) ఏకమయ్యాయనీ, అయినా తాను వెనక్కి తగ్గబోననీ అన్నారు. అవినీతిపరుల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు.
అంతా వారే...
''రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి రాజ్యమేలుతున్నాయి. తండ్రి, కొడుకు, కుమార్తె... అంతా అధికారంలో ఉంటారు. దీనివల్ల అవినీతి పెరుగుతుంది. కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదు. కొంత మంది ప్రగతి నిరోధకులుగా మారారు. ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు తీసుకుంటున్నాం'' అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామనీ, దళారీ వ్యవస్థ లేకుండా డిజిటల్ విధానాన్ని తెచ్చామని చెప్పారు. ''దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా.. వద్దా? అవి నీతిపై పోరాటం చేయాలా.. వద్దా? అవినీతి పరుల విషయంలో చట్టం తనపని తాను చేసుకోవాలా... వద్దా? అంటూ సభికుల నుంచే సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. జనథన్ ఖాతాలు తెరవాలనే ఆలోచన అప్పటి ప్రభుత్వాలకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశం ప్రధమస్థానంలో ఉందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి నరేంద్రమోడీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అన్నారు. దానిలో భాగంగానే రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారని చెప్పారు.
సీఎంకు ఏం పీకే పని ఉంది- బండి సంజయ్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ఏం పీకే పని ఉందని ప్రధాని సభకు హాజరుకాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరేడ్‌గ్రౌండ్‌లో సభ అనంతరం అక్కడే ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కోసం తాము వేదికపై కుర్చీవేసి, సన్మానించేందుకు శాలువా కూడా తెచ్చామని చెప్పారు. ఆయన షెడ్యూల్ ఏంటో ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వేలకోట్ల అభివృద్ధి పనులు వస్తుంటే, కనీస మర్యాదకోసమైనా ఆయన ప్రధానిని కలవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ని పరుష పదజాలంతో విమర్శించారు.