Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి పనుల కోసమా.. మాపై విషం కక్కడానికా..?
- ప్రధానిని ఉద్దేశించి మంత్రి హరీశ్ ఎద్దేవా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శనివారం రాష్ట్రానికి విచ్చేసిన ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్టుగా లేదనీ, తమ ప్రభుత్వాన్ని తూలనాడటానికే ఆయన వచ్చారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. 'మీరు అభివృద్ధి పనుల కోసం వచ్చారా..? లేక మమ్మల్ని తిట్టటానికా...?' అని ఆయన మోడీని ప్రశ్నించారు. ప్రధాని తెలంగాణపై తన కడుపులోని విషాన్ని మొత్తం కక్కారని పేర్కొంటూ ట్వీట్ చేశారు. 'పర్యటన సందర్భంగా మోడీ మాట్లాడిన ప్రతీ మాటా సత్య దూరం. ప్రధానిగా ఇన్ని అబద్ధాలాడటం ఆయనకే చెల్లింది...' అంటూ విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ ఆసరా పెన్షన్లు, రైతు బంధు లాంటివి నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమవుతున్నాయి. ఈ వాస్తవాలను మరుగుపరిచిన పీఎం... తన వల్లే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ- నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే నగదు బదిలీ) మొదలైనట్టు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఇందులో మోడీ గొప్పలు చెప్పుకోవాల్సింది ఏముందంటూ ప్రశ్నించారు.
'రైతుబంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యింది. అయినా ఆ పథకం వల్లే మొదటిసారి రైతులకి లబ్ది చేకూరిందంటూ ప్రధాని చెప్పుకోవడం సిగ్గు చేటు. రైతు బంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత..? వ్యవసాయానికి, పరిశ్రమలకు కేంద్రం చేయూత అని చెప్పటం పూర్తి అవాస్తవం. ఐటీఐఆర్‌ను బెంగళూర్‌కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అర్బిట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన వెంటనే గుజరాత్లో అలాంటి సెంటర్‌నే ఏర్పాటు చేశారు. తెలంగాణలో ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. ఇవన్నీ చేసింది మీ ప్రభుత్వం కాదా మోడీ గారు...' అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. 'అదానీ వాదం గురించి ప్రజల దృష్టిని మళ్లించటానికి వీలుగా.. లేని పరివారవాదం గురించి మాట్లాడడం మీకే చెల్లింది.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించటం లేదంటూ ప్రధాని చెప్పడం హాస్యాస్పదం. నిజానికి ఈ పరిస్థితి రివర్స్‌గా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటి వాటిని ఇవ్వకుండా కేంద్రమే తెలంగాణకు సహాయ నిరాకరణ చేస్తోంది...' అని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.