Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎందుకీ వేర్వేరు నిబంధనలు? : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమిళనాడులోని బొగ్గు గనులను వేలం జాబితా నుంచి కేంద్రం తప్పించిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. సింగరేణి కాలరీస్ విషయంలోనూ తాము ఇదే డిమాండ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని నాలుగు బొగ్గు గనులను వేలం నుంచి తప్పించాలని కోరారు. వాటిని ప్రయివేటీకరించకుండా సింగరేణికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేస్తూ.. తమిళనాడులోని గనులను వేలం జాబితా నుంచి కేంద్రం తప్పిస్తున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక రాసిన వార్తను పోస్టుకు జత చేశారు. ఈ క్రమంలో ఒకే దేశంలో ఉన్న రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. కాగా ప్రభుత్వం లేదా ప్రయివేటు కంపెనీలు ఏవైనా సరే వేలంలో టెండర్లు దాఖలు చేసి బొగ్గు గనులు సొంతం చేసుకోవాల్సిందేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే గనులను స్వచ్ఛందంగా సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే. కానీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 101 బొగ్గు గనులను వేలం వేయడానికి గత నెల 29న కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ గనులపై ఈ నెల 12న ప్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తామనీ, ఆసక్తి గల ప్రభుత్వ లేదా ప్రయివేటు కంపెనీలు హాజరై టెండరు ప్రక్రియ వివరాలు తెలుసుకోవాలని కేంద్ర బొగ్గుశాఖ తాజాగా మరో నోటిఫికేషన్ జారీచేసింది. ఈ క్రమంలో కేంద్రం విధానాలను తప్పుబడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.