Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి కంటి పరీక్షలు ....
- 16,33,988 మందికి కండ్లద్దాల పంపిణీ..
- సమాచార, పౌర సంబంధాలశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజల జీవితాలలో కొత్త కాంతులు వస్తున్నాయి. కంటి సమస్యలతో బాధపడే వారి ఇబ్బందులను తొలగించేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఆయా శిబిరాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. కంటి పరీక్షలు చేయించుకునేందుకు నగరాలు, పట్టణాలకు, ఆసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జనావాసాల వద్ద శిబిరాలు నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు క్యాంపులకు యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. వయస్సుతో నిమిత్తం లేకుండా జనాలు క్యాంపులకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణలో ప్రజా ప్రతినిధులు, అధికారులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రజలు కంటి వెలుగు క్యాంపుల వద్ద సకాలంలో చేరుకునే విధంగా ముందస్తుగా అవగాహన కల్పించి తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తూ క్యాంపు జయప్రదమయ్యేలా కృషి చేస్తున్నారు. కంటి పరీక్షల నిర్వహణ లో వచ్చే ఖర్చుకు భయపడో, అవగాహన లేక పరీక్షలు చేయించుకోని వారికి ఈ కార్యక్రమం ఒక వరంలా మారిందనీ, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు అందించడం తో ప్రజలు సంబరపడుతున్నారని అర్వింద్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి మంది ప్రజలకు 1,500 వైద్య బందాలతో కంటి పరీక్షలు నిర్వహించారు. రెండో విడతలో ఇప్పటి వరకు కోటి మందికిపైగా కంటి పరీక్షలు చేయగా, 64.07 శాతం లక్ష్యాన్నిచేరుకున్నారు. ఇందులో 47,70,757 మంది పురుషులు, 53,85,293 మంది స్త్రీలు, 3,360 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. 16, 33,988 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 12,31,523 మందిని ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం గుర్తించారు. 72,99,858 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్దారించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాల్లో ఉన్న బఫర్ బృందాలతో ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పోలీసులకు, న్యాయవాదులకు, వివిధ వర్గాల వారికి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.