Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స
నవ తెలంగాణ- మహబూబ్నగర్
కల్తీ కల్లు తాగి పదిమంది అస్వస్థతకు గురైన సంఘటన మహబూబ్నగర్ పట్టణ శివారులో ఉన్న దొడ్డలోనిపల్లిలో శనివారం జరిగింది. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్చార్జీ డాక్టర్ శిరీష, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దొడ్డలోనిపల్లి, మోతీనగర్, కోయనగర్ ఇతర ప్రాంతాలకు చెందిన కూలీలు రోజు కూలి చేసుకుంటూ జీవిస్తున్నారు. కొంతమంది పని పూర్తయిన తర్వాత కల్లు తాగుతుంటారు. ఈ నేపథ్యంలో శనివారం కల్లు తాగుతున్న సమయంలో పదిమంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కల్లులో డోస్ ఎక్కువగా ఉండడం, కల్తీ అయి ఉంటుందని జిల్లా ఆస్పత్రి ఇన్చార్జీ తెలిపారు. అందులో నలుగురి పరిస్థితి కొంత విషమంగా ఉన్నా.. ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదని శిరీష తెలిపారు. అందుబాటులో ఉండి చికిత్స అందిస్తున్నామన్నారు. కల్తీ కల్లు సరఫరా చేస్తున్న వారిమీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.