Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం
- వినోద్‌కుమార్‌తో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధుల భేటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం కార్మికులు చేపట్టిన పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విశాఖ పర్యటనకు రావాలంటూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆహ్వానం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మెన్ సహా ప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఆ కమిటీ చైర్మెన్ మంత్రి రాజశేఖర్, కో కన్వీనర్ నీరుకొండ రామచందర్‌రావు, ప్రతినిధి మంత్రి మురళీకృష్ణ రావు పాల్గొన్నారు. పలు అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. సుమారు రూ.నాలుగు లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు కలిగిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసి దాన్ని ప్రయివేటు సంస్థకు అప్పనంగా ధారాదత్తం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి రాజశేఖర్ తెలిపారు. ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని, జాతి సంపద అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉద్యమానికి బీఆర్ఎస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ కమిటీ ఆహ్వానాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు.