Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గంటలు దుకాణాలు తెరవొద్దు
- జీవో ఉపసంహరించుకోవాలని సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో 24 గంటలు దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వ్యాపరస్తులు, యాజమాన్యాలకు ఉపయోగపడుతుందనీ, వాటిలో పనిచేసే కార్మికులు మాత్రం మరింత శ్రమదోపిడీకి గురవుతారని చెప్పారు. ఇప్పటికే షాపుల్లో ఉద్యోగులు పూర్తి అభద్రతతో పనిచేస్తున్నారనీ, వారికి కనీస వేతన చట్టాలు అమలు కావట్లేదని తెలిపారు. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల జీవోలు సవరించలేదని గుర్తుచేశారు. పెరుగుతున్న ధరలకు, వస్తున్న వేతనాలకు సంబంధం లేకుండా కార్మికులు బతుకులు ఈడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పుడు, యాజమాన్యాలు ఎలా వారి సంక్షేమాన్ని కాంక్షిస్తాయని ప్రశ్నించారు. మహిళలతో కూడా వారి అనుమతితో రాత్రిపూట పనిచేయంచు కోవచ్చనీ, వారి భద్రత, రక్షణ యాజమాన్యాలు తీసుకోవాలని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఐటీ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకే ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోతున్నదనీ, ఇక సామాన్య మహిళలకు యాజమాన్యాలు ఎలా రక్షణ కల్పిస్తాయని ప్రశ్నించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అదే కేంద్రం తెచ్చిన కార్మిక చట్టాల కోడ్స్ అమలుకు పూనుకోవడం సమర్థనీయం కాదన్నారు. తక్షణం 24 గంటల జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.