Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వనరులను అదానీకి కట్టబెట్టే కుట్ర : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని మోడీ వచ్చారు.. తెలంగాణకు ఏమిచ్చారు, ఏమి తెచ్చారు? అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. విభజన హామీల్లో ఏ ఒక్క దాన్నీ కేంద్రం అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణలోని వనరులను అదానీకి కట్టబెట్టేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయించకుండా, ఎలాంటి సహకారం ఇవ్వని మోడీకి తెలంగాణకు వచ్చే నైతిక హక్కు లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన హామీలన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నాయని, వాటిలో ఒక్కటైనా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తొమ్మిదేండ్లు గడుస్తున్నా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం వంటి అనేక హామీలను గాలికొదిలేశారని చెప్పారు.
తెలంగాణకు ఏమీ ఇవ్వకపోగా, అదానీకి వనరులను కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని అన్నారు. దొడ్డి, దొంగదారిన సింగరేణి సంస్థ గొంతు నులిమి, ప్రయివేటుపరం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. గుజరాత్, జార్ఖండ్, బీహార్ల్లోని గనులను అక్కడి ప్రభుత్వాలకే అప్పగించారని, కానీ తెలంగాణలోని గనులను ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించకుండా ప్రయివేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కక్ష అని, అందుకే గనులను ఇవ్వకుండా ప్రయివేటుపరం చేస్తున్నారని అన్నారు.
మోటార్లకు మీటర్లను బిగిస్తే వ్యవసాయ రంగం కుదేలవుతుందని, అప్పుడు ఆ రంగాన్ని కూడా అదానీకి ఇచ్చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విద్యార్థులను బలిపశువులను చేశారని కూనంనేని విమర్శించారు. పేపర్ లీకేజీకి పాల్పడేవారు దేశభక్తులా?అని కూనం నేని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇందుకోసం ఉపా కంటే మెరుగైన చట్టాన్ని తేవాలని సూచించారు. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో చర్చకు ఎందుకు అవకాశం లేదని మోడీని ప్రశ్నించారు. మోడీ హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సీపీఐ, విద్యార్థి సంఘం నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వానికి మించిన అత్యుత్సాహాన్ని వారు ప్రదర్శించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, ఈటి నరసింహ తదితరులు పాల్గొన్నారు.