Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ తరగతుల ఏర్పాటుకు
- ప్రధాని మోడీకి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతుల (ప్రీప్రైమరీ)ని ఏర్పాటు చేసేందుకు రూ.ఐదు వేల కోట్లు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి శనివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో 95 శాతం తల్లిదండ్రులు వారి పిల్లలను మూడేండ్లు నిండగానే పూర్వ ప్రాథమిక తరగతుల్లో చేర్చుతున్నారని తెలిపారు. ఆ తరగతుల కోసం అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నదని పేర్కొన్నారు. వాటిలో ఒక్క గది మాత్రమే ఉంటుందని వివరించారు. కొన్నిచోట్ల స్వంత భవనాల్లేక కిరాయి గదుల్లో నడుపుతున్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రానికి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మూడేండ్ల నుంచి ఆరేండ్ల మధ్య వయస్సు గల బాల, బాలికలు రావాలని పేర్కొన్నారు. ఆ గదిలోనే వంట కూడా చేయాలని వివరించారు. అంగన్వాడీ టీచర్ ఒక్కరే అందరినీ చూసుకోవాలని తెలిపారు. ఈ కారణాల వల్ల ఆయా కేంద్రాలను తల్లిదండ్రులు పూర్వ ప్రాథమిక కేంద్రాలుగా పరిగణించడం లేదని స్పష్టం చేశారు. దీనివల్ల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వేల రూపాయలు వెచ్చించి మూడేండ్లు నిండగానే ప్రయివేటు పాఠశాలలకు పంపించాల్సి వస్తున్నదని తెలిపారు. తద్వారా వారు అప్పులపాలవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల పరిషత్, గిరిజన సంక్షేమ పాఠశాలలు 18 వేల వరకున్నాయని తెలిపారు. వాటిలో పదివేల ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతుల ఏర్పాటు కోసం రూ.ఐదు వేల కోట్లు ప్రత్యేక గ్రాంటును తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయాలని నర్సిరెడ్డి కోరారు.