Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కో ఆపరేటివ్ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలో సాగర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల సహకార వ్యవస్థకు ప్రమాదం ఏర్పడిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఆందోళన వ్యక్తం చేశారు. సహకార వ్యవస్థ రక్షణ కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో తెలంగాణ స్టేట్ వ్యవసాయ కో ఆపరేటివ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభ ఎండీ సర్ధార్ అధ్యక్షతన జరిగింది. మహాసభ ప్రారంభోత్సవం సందర్భంగా సాగర్ మాట్లాడుతూ కేంద్రం సహకార రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు.
రాష్ట్రాల హక్కులను కాలరాసేలా నిర్ణయం తీసుకుంటున్నదని చెప్పారు. బడా పెట్టుబడిదారులకు వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పేలా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మల్టీస్టేట్ లెవెల్ కో ఆపరేటివ్ సొసైటీ చట్టాన్ని తీసుకొచ్చి సహకార సంఘాలన్నిటిని ప్రయివేటుపరం చేసేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టిందన్నారు. సహకార సంఘ ఉద్యోగులు, రైతులు ఐక్యంగా ఆ విధానాలను తిప్పి కొట్టాల్సిన అవసరముందని తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, యూనియన్ గౌరవాధ్యక్షులు కె. భూపాల్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. జీవో నెంబర్44లోని లోపాలను సవరించి తద్వారా ఉద్యోగులకు అందాల్సిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి పి ఈశ్వర్‌గౌడ్ కార్యదర్శి నివేదిక ప్రవేశ పెట్టారు. సహకార రంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సంఘాన్ని బలోపేతం చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు.
యూనియన్ ఆర్థిక నివేదికను పి నరేందర్‌రెడ్డి ప్రవేశ పెట్టారు. వివిధ జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధులు పలు సూచనలు చేశారు. అనంతరం మహాసభ భవిష్యత్తు కర్తవ్యాలను నిర్ధేశించుకుంది. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. గౌరవాధ్యక్షులుగా కె.భూపాల్, అధ్యక్షులుగా ఎండీ సర్దార్, ప్రధాన కార్యదర్శిగా పి.ఈశ్వర్ గౌడ్, కోశాధికారిగా ఈశ్వరప్ప, ఉపాధ్యక్షులుగా రాందాస్, నరేందర్ రెడ్డి, వెంకటస్వామి, సహాయ కార్యదర్శులుగా నిసార్ అహ్మద్, యు. రవీందర్, బి గణేష్, కార్యవర్గ సభ్యులుగా వెంకట్‌రెడ్డి, కేశవరెడ్డిని మహాసభ ఎన్నుకుంది.