Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ కార్యాలయం ముందు పోలీసుల మోహరింపు
- ప్రధాని రాక సందర్భంగా అడుగుగడుగునా నిఘా
- నిరంకుశ బీజేపీ నశించాలి : సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శనివారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం (సత్యనారాయణ రెడ్డి భవన్) చుట్టూ పోలీసులు వందలాదిగా మోహరించారు. శనివారం ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన తెలిపేందుకు అనుమతి లేదని నిరాకరించారు. అయినా సీపీిఐ శ్రేణులు నలువైపులనుంచి అకస్మాత్తుగా దూసుకొచ్చి పోలీసుల వలయాన్ని ఛేదించుకుని అక్కడ ప్రదర్శన నిర్వహించారు. ఫ్లకార్డులు చేతబూని 'మోడీ హటావో - దేశ్‌కీ బచావో, మోడీ గో బ్యాక్, నిరంకుశ బీజేపీ నశించాలి, విభజన హామీలు అమలు చేయాలి'..అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసులు ప్రదర్శనను అడ్డుకోవడానికి ప్రయత్నించటంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తత నెలకొన్నాయి. పోలీసులకు కార్యకర్తలకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. అనంతరం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎనిమిదేండ్ల కాలంలో ఏ ఒక్క విభజన హామీలను అమలు చేయని ప్రధాని మోడీ రాష్ట్రంలో అడుగుపెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజలకు ద్రోహం చేస్తున్నదని వాపోయారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ.టి. నరసింహా, వి.ఎస్.బోస్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి. స్టాలిన్, సీనియర్ నాయకులు పి. ప్రేమ్ పావని, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.