Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్షాలే దేశానికి రక్ష
- పూర్వవైభవానికి కలిసి పనిచేద్దాం
- సీపీఐ, సీపీఐ(ఎం) ఉమ్మడి సమావేశం ఓ ముందడుగు
- రాష్ట్రాల వారీగా నిర్వహించేందుకు ఇది స్ఫూర్తిదాయకం
- త్యాగాలతో ఏర్పడిన ఎర్రజెండా అజరామరం
- మోడీ సర్కారును గద్దెదించడమే లక్ష్యం
- మతోన్మాదం, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుదాం
- దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు ఏచూరి, రాజా పిలుపు
కమ్యూనిస్టుల ఐక్యత చారిత్రక కర్తవ్యమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. దేశంలో, రాష్ట్రంలో వామపక్షాలకు పూర్వవైభవం తెచ్చేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పనిచేయాలని కోరారు. వామపక్షాలే దేశానికి ప్రత్యామ్నాయమని ఉద్ఘాటించారు. ఎర్రజెండా రంగులద్దుకుని ఏర్పడింది కాదని, అమరుల నెత్తురద్దుకుని ఆవిర్భవించిందని, అందుకే అది అజరామరమని చెప్పారు. వామపక్షాల ఐక్యతకు సీపీఐ, సీపీఐ(ఎం) ఉమ్మడి సమావేశం ఓ ముందడుగు అని అభివర్ణించారు. నిర్దిష్ట రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాల వారీగా నిర్వహించేందుకు ఈ సమావేశం స్ఫూర్తిదాయకమని అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో నేడు దేశం, రాజ్యాంగమే ప్రమాదంలో పడిందన్నారు. మతోన్మాదం, కార్పొరేట్ అనుకూల విధానాలు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఏకం కావాలని, దేశంలోని వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులన్నీ కలిసి రావాలని వారు కోరారు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే తమ లక్ష్యమని, అప్పుడే దేశానికి భవిష్యత్తు ఉంటుందని వారు ప్రకటించారు. సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో ఉమ్మడి సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రంలు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇరు పార్టీలకు చెందిన మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పాల్గొని ప్రసంగించారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతమే దేశానికి ప్రమాదకరం : డి రాజా
కమ్యూనిజం అత్యంత ప్రమాకరమంటూ ప్రధాని మోడీ చెప్తున్నారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. ప్రజలను విభజించి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఫాసిస్టు భావజాలంతో ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతమే ప్రమాదకరమని విమర్శించారు. హిందూత్వ రాష్ట్రం ఏర్పడితే దేశ సమైక్యతకు గొడ్డలిపెట్టు అని అంబేద్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. మనుధర్మ శాస్త్రాన్ని భారత దేశ రాజ్యాంగంగా మార్చాలని కుట్ర జరుగుతున్నదని చెప్పారు. కుల నిర్మూలన కోసం అంబేద్కర్ పనిచేస్తే అందుకు భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తున్నదని అన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థ ఉండాలంటున్నదని వివరించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేస్తే అదానీ, మోడీ మధ్య ఉన్న సంబంధం బయటకొస్తుందనే అందుకు కేంద్రం సిద్ధంగా లేదన్నారు. మోడీ ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నదని చెప్పారు. గవర్నర్లను అడ్డంపెట్టుకుని తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఢిల్లీలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. ఒకే దేశం, ఒకే భాష తరహాలో ఒకే పార్టీ, ఒకే నాయకుడు, అది మోడీ అంటూ బీజేపీ తన ఏకస్వామ్యానికి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. 2024లో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశం కోసం, ప్రజల కోసం బీజేపీని ఓడించడమే లక్ష్యంగా వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 1980లో కలకత్తాలో సీపీఐ మహాసభలో చండ్ర రాజేశ్వర్‌రావు కమ్యూనిస్టుల పునరేకీకరణ గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. 1992లో హైదరాబాద్‌లో జరిగిన మహాసభలో సీపీఐ, సీపీఐ(ఎం)ల మధ్య సమన్వయ కమిటీలు ఉండాలంటూ తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రజిత్ గుప్తా సూచించారని చెప్పారు. కొంత ప్రయత్నం జరిగినా అది కొనసాగలేదన్నారు. గతేడాది విజయవాడలో తమ పార్టీ జాతీయ మహాసభలో కమ్యూనిస్టు ఉద్యమ ఏకీకరణ అవసరమంటూ తీర్మానం చేశామని చెప్పారు. కమ్యూనిస్టులే భారతదేశానికి దిక్సూచి అని అన్నారు. భిన్నమైన వైఖరులు, పరస్పర వైరుధ్యాలు పక్కనపెట్టి ఎర్రజెండా ఒక్కటిగా ఉండాలన్నారు.
మోడీ పాలనలో ఆర్థిక అసమానతలు : ఏచూరి
మోడీ పాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. 40 శాతం సంపద ఒక శాతం సంపన్నుల వద్ద కేంద్రీకృతమై ఉందన్నారు. 50 శాతం ప్రజల వద్ద మూడు శాతం సంపద మాత్రమే ఉందని వివరించారు. ఈ ఆర్థిక అసమానతలతో పేదలు పేదలుగానే ఉంటున్నారని, ధనికులు మరింత ధనికులుగా మారిపోతున్నారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక నిరుద్యోగం ఈ స్థాయిలో ఎప్పుడూ లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుల జీవితాలను సర్వనాశనం చేశారని చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1,200కు పెరిగిందన్నారు. దేశంలో 80 కోట్ల మందికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం లేదా గోధుమలు ఇస్తున్నామంటూ ప్రధాని మోడీ గొప్పలు చెప్తున్నారని అన్నారు. ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు ఇవ్వకపోతే 80 కోట్ల మంది బతకలేరని, ఇది మోడీ ప్రభుత్వం సాధించిన ఘనకార్యమా?అని ప్రశ్నించారు. ఈ ఏడేండ్ల కాలంలో కార్పొరేట్లకు రూ.11 లక్షల కోట్ల రుణాలను కేంద్రం మాఫి చేసిందన్నారు. ఈనెల ఐదో తేదీన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు లక్షలాది మంది చలో ఢిల్లీకి వచ్చారని, వారి రుణాలను మాఫీ చేయమంటే మాత్రం మోడీ ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదన్నారు. ఈ దేశాన్ని లూటీ చేసే కార్పొరేట్ల రుణాలను మాత్రం మాఫీ చేసిందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు సీబీఐ, ఈడీలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని వివరించారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దారిమళ్లించేం దుకు మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని చెప్పారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి నాడు మత ఘర్షణలు జరిగిన సందర్భాలు దేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేవని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అవి మొదలయ్యాయని చెప్పారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో హిందూత్వ ఓట్ల కోసమే టిప్పు సుల్తాన్‌పై బీజేపీ విమర్శలు చేస్తున్నదని విమర్శించారు.
హిందుత్వ రాజ్యం కోసమే ఆర్ఎస్ఎస్-బీజేపీ కుట్ర పూరితంగా మత ఘర్షణలను రెచ్చగొడుతున్నాయని అన్నారు. బీజేపీ ప్రమాదాన్ని ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకత కమ్యూనిస్టులపైనే ఉందన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా అధికారం బీజేపీదే అంటూ ఆపార్టీ నాయకులు బాహాటంగా ప్రకటిస్తున్నారని వివరించారు. అదానీ అక్రమాలు, కుంభకోణంపై సమాధానం ఇవ్వకుండా అధికార బీజేపీ పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుందని చెప్పారు. అదానీ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులడిగిన ప్రశ్నలు కనిపించకుండా రాజ్యసభలో రికార్డుల నుంచి వాటిని తొలగించారని అన్నారు. కమ్యూనిస్టులు ఏకమై, బీజేపీ ఫాసిస్టు విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
మోడీ మళ్లీ గెలిస్తే దేశాన్ని అమ్మేస్తారు
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
ప్రధాని మోడీ మళ్లీ గెలిస్తే దేశాన్నే అమ్మేస్తారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవా లని ఆయన పిలుపునిచ్చారు. అన్ని పార్టీల కంటే ఎక్కువగా కమ్యూనిస్టులపైనే ఆ కర్తవ్యం ఎక్కువగా ఉందన్నారు. ఫాసిస్ట్ శక్తుల పాలన దేశానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి మళ్లీ అధికారమిస్తే భవిష్యత్తు లేకుండా చేస్తున్నదని చెప్పారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఆ నాలుగు ఎంపీ స్థానాలను కూడా రాకుండా అడ్డుకోవాలని చెప్పారు. దేశాభివద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయంటూ మోడీ వ్యాఖ్యానించడాన్ని రాఘవులు ఈసందర్భంగా తప్పుపట్టారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడమే అభివద్ధా? అని ప్రశ్నించారు. సికింద్రాబాద్, విజయవాడ రైల్వేస్టేషన్లను అమ్మేందుకే వాటిని సుందరంగా తీర్చిదిద్దుతారని ఎద్దేవా చేశారు. బ్యాంకులు, పోర్టులు, విమానాశ్రయాలను, ప్రభుత్వ రంగ సంస్థల భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2014లో అదానీ ఆస్థి రూ 7వేల కోట్లు... 2023లో అది రూ.16 లక్షల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ఏం కష్టం చేసి అంత సంపాదించారో చెప్పాలన్నారు. దేశాన్ని కొల్లగొట్టి సంపాదించారని చెప్పారు. భాగ్యలక్ష్మి దేవాలయ నగరం నుంచి వెంకటేశ్శర నగర్‌కు వందేభారత్ రైల్ పోతుందంటూ మోడీ చెప్పడం ద్వారా ఒక హిందూ గుడి నుంచి మరో హిందూ గుడికి ఆ రైలు పోతుందని చెప్పదలిచారని విమర్శించారు. వందే భారత్ రైలుకు హిందూ,ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా ఉండదనీ, కానీ మోడీ మాత్రం రైల్ ప్రారంభోత్సవాన్ని కూడా మతోన్మాదానికి ఉపయోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల కులాలు, మతాలకు అతీతంగా ప్రజలను ఐక్యం చేయాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. ఉభయ కమ్యూనిస్టులు క్షేత్రస్ధాయిలో కలిసి ఉద్యమాలు నిర్వహించాలని సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విష సంస్కృతిని సోషల్ మీడియా వేదికగా నిలువరించాలని పిలుపునిచ్చారు. శాసనసభలో స్థానం సంపాదించాలనీ, ప్రజా సమస్యల కోసం దాన్ని ఉపయోగించాలని సూచించారు. కమ్యూనిస్టులు లేని శాసనసభ విగ్రహంలేని గుడి లాంటిదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సంఘ పరివార్ శక్తులను ఎదుర్కొనేందుకు ఐక్యతను ప్రదర్శించాలని సీపీఐ, సీపీఐ(ఎం) శ్రేణులకు రాఘవులు పిలుపునిచ్చారు.
ఆ ఓడరేవుపై దాడి చేసే దమ్ముందా?
- సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
ప్రధాని మోడీకి గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవుపై దాడి చేసే దైర్యముందా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ప్రశ్నించారు. దేశంలోకి డ్రగ్స్ ఆ ఓడరేవు ద్వారానే సరఫరా అవుతున్నాయని వివరించారు. ఇప్పటికిప్పుడు గుజరాత్ ఓడరేవుపై దాడి చేస్తే కొన్ని వేల కోట్ల డ్రగ్స్ బయటపడుతాయని తెలిపారు. గాడ్సే వారసుడిగా మోడీ వచ్చారనీ, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్, జ్యుడిషియల్, దర్యాప్తు వ్యవస్థలను మోడీ తమ గుప్పిట్లో పెట్టుకున్నారని చెప్పారు. ఆయన క్యాబినెట్‌లోని 24 మంది మంత్రులపై కేసులు ఉన్నాయనీ, వారిపై చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. దేశానికి టెర్రరిస్టుల ప్రమాదం కంటే మోడీతో రాజ్యాంగానికి ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. ఆయన హయాంలో లక్షల కోట్లు నల్లధనం వైట్ మనీగా మారిందని విమర్శించారు. దేశంలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని చెప్పారు. అందు కోసం ముందుగా రాజకీయ పరమైన ఐక్యత రావాలని కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక పార్టీల మధ్య రాజకీయ సంబంధాలు మెరుగుపడాలని ఆకాంక్షించారు. పదోతరగతి పరీక్ష పత్రాల లీకులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కమ్యునిస్టు పార్టీలు ప్రజా సమస్యలపై ఐక్యంగా కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డల మాదిరిగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోరాటం చేయాలని సూచించారు.