Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడివిడిగా కాదు.. కలివిడిగా...
- బీజేపీపై సమరానికి సీపీఐ, సీపీఐ (ఎం) సన్నద్ధం
- ఆ దిశగా ఉభయ పార్టీల శ్రేణులకు నేతల నిర్దేశం
- భావజాల పరంగానే కాదు.. భౌతిక శక్తిగానూ బలోపేతం కావాలంటూ పిలుపు
- దేశానికి, తెలంగాణకు అదే కీలకమంటూ ఉద్బోధ
- కార్యకర్తలు, నాయకుల్లో సమరోత్సాహాన్ని నింపిన నాంపల్లి సభ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఏయ్ బిడ్డా.. ఇది తెలంగాణ సాయుధ పోరాట గడ్డ... ఎర్రజెండా అడ్డా...' అన్నట్టుగా సీపీఐ, సీపీఐ (ఎం) శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి కదిలొచ్చాయి. 'ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క...' అనే రీతిలో కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలపై కలిసికట్టుగా సమరశంఖం పూరించాయి. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికగా ఆదివారం నిర్వహించిన సీపీఐ, సీపీఐ (ఎం) క్రియాశీల కార్యకర్తల సమావేశం విజయవంతమైంది. దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన ఈ సభ యావత్ భారత కమ్యూనిస్టు ఉద్యమానికే 'మొదటి అడుగు'గా అగ్రనేతలు సీతారాం ఏచూరి, డి.రాజా అభివర్ణించారంటే ఆ సభ ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నదనే విషయం విదితమవుతున్నది.
దేశంలో మొదటి నుంచి లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం నికరంగా పోరాడుతున్న సీపీఐ, సీపీఐ (ఎం)... సంయుక్తంగా ఇప్పుడు ఒక బృహత్తర కర్తవ్యాన్ని భుజాన వేసుకోవాలంటూ ఈ సభ పిలుపునిచ్చింది. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించటమే ఆ బాధ్యతంటూ నొక్కి చెప్పింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పూనుకోకపోతే ఆ బాధ్యతను నెరవేర్చే వారే ఉండబోరంటూ సమావేశం హెచ్చరించింది. ఇతర బూర్జువా పార్టీలు తమ అవసరార్థం, రాజకీయ ప్రయోజనాలరీత్యా, సందర్భానుసారంగా దేశం గురించి, రాజ్యాంగం గురించి చెప్పినా.. ఆ సమున్నత లక్ష్యాల కోసం రాజీలేని పోరు సల్పేది మాత్రం ఎర్రజెండాలేనని స్పష్టం చేసింది. ఆరెస్సెస్ అజెండాను, దాని మూల సూత్రమైన మనువాదాన్ని తూ.చా. తప్పకుండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ భావజాలాన్ని సైద్ధాంతికంగా తిప్పికొట్టగలిగేది కమ్యూనిస్టులు మాత్రమేనని స్పష్టం చేసింది. ఇదే సమయంలో కేవలం భావజాలపరంగానే కాకుండా తెలంగాణలో భౌతికంగానూ ఎదిగేందుకు కృషి చేయాలంటూ జిల్లా, మండల స్థాయి నాయకులకు సమావేశం ఉద్భోదించింది.
ఈ నేపథ్యంలో అగ్రనేతల పిలుపునందుకుని ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు కదనరంగంలోకి దూకారు. తమకిచ్చిన కర్తవ్యాలను భుజాన వేసుకుని సొంతూళ్లకు పయనమయ్యారు. ఆద్యంతం అత్యంత ఉత్సాహ, ఉద్వేగపూరిత వాతావరణంలో కొనసాగిన ఈ సభలో 'సుతీ, కంకి కొడవళ్లు ' ఒక్కటిగా మెరిశాయి. ఎర్రజెండాలు రెపరెపలాడాయి.