Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాము కాటేసిందని వైద్యానికి వెళ్తే..
- ఎలుక కరిచిందంటూ గంటైనా అందించని వైద్యం
- ప్రధాన రహదారిపై గ్రామస్తుల రాస్తారోకో
నవతెలంగాణ - వెంకటాపురం
పాము కాటేసిందంటూ ములుగు జిల్లా వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు వైద్యం కోసం తీసుకొస్తే.. ఎలుక కరిచిందంటూ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అత్యవసరంగా అందించాల్సిన వైద్య సేవలు అందకపోవడం, బాలిక నోట్లో నుంచి నురగరావడం గమనించిన వైద్యులు ఏటూరునాగారం తరలించాలని ఉచిత సలహా అందించి చేతులు దులుపుకున్నారు. బాలికను ఏటూరునాగారం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. బాలిక మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బెస్తగూడెం గ్రామస్థులు వెంకటాపురం ప్రధాన రహదారిపై అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు యాదగిరి, రజిత తెలిపిన వివరాల ప్రకారం... బెస్తగూడెం గ్రామానికి చెందిన తేజశ్రీ (6) ఆదివారం ఇంట్లో మంచంపై ఆడుకుంటుండగా.. బీరువా సమీపంలో ఉన్న పాము బాలిక కాలుపై కాటువేసింది. బాలిక వెంటనే తల్లిదండ్రులకు విషయాన్ని చెంపగా.. చికిత్స కోసం వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. తమ కూతురిని పాముకాటేసిందంటూ ఆస్పత్రి సిబ్బందికి తెలపగా.. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది వైద్యాధికారికి సమాచారాన్ని అందించారు. తీరు బడిగా వచ్చిన వైద్యాధికారి పాము కాదు.. ఎలుక కరిచిందంటూ గంటకు పైగా వైద్యం అందించలేదంటూ బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గంట తర్వాత బాలిక నోట్లో నుంచి నురగరావడం గమనించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం తరలించాలని ఉచిత సలహా ఇచ్చారు. బాలికను ఏటూరునాగారం తరలిస్తుండగా బాలిక మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు.. పేరూరు-వెంకటాపురం ప్రధాన రహదారిపై అంబేద్కర్ సెంటర్ వద్ద బాలిక మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. 2 గంటలకు పైగా ప్రధాన రహదారిపై బైటాయించారు. దాంతో ఆందోళన స్థలానికి చేరుకున్న సీఐ శివప్రసాద్ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. వైద్యుల నిర్లక్షంపై ఉన్నతాధికారులకు వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్ ఫోన్లో వివరించారు. వైద్యులు సకాలంలో బాలికకు వైద్యం అందించి ఉంటే బాలిక బతికేదని, వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాలిక మృతి చెందిందని వైద్యాధికారిపై ఫిర్యాదు చేశారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులు మీకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.