Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
- మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించేది లేదు
- పీఆర్సీని తక్షణమే నియమించాలి
- పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేయాలి : టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు, ఉపాధ్యాయులను మరోసారి వంచించే ప్రయత్నంలో భాగంగానే కంటితుడుపు చర్యగా కేంద్రం కమిటీ వేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరింది. మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని తక్షణమే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం-2020 పేరుతో పాఠశాలల్లో విద్యార్థుల నమోదును ఆరేండ్లు నిండిన తర్వాతే చేర్చుకోవాలంటూ పేర్కొనడం సరైంది కాదన్నారు. ఇది విద్యార్థులను ప్రయివేటు బడులవైపు మళ్లించడం తప్ప మరొకటి కాదని చెప్పారు. ప్రీప్రైమరీ తరగతులను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తామని, ఆరేండ్లు నిండిన వారిని ఒకటో తరగతిలో చేర్చుకోవాలని చెప్పడం ద్వారా కేజీ తరగతుల పేరుతో నిర్వహిస్తున్న కార్పొరేట్ పాఠశాలలకు చట్టబద్ధత వచ్చినట్లవుతుందని విమర్శించారు. నూతన విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. అధ్యక్షత వహించిన టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య మాట్లాడుతూ కేంద్రం ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగిస్తూ వారి ఎజెండాలో భాగంగా ఉన్న మతపరమైన అంశాలను చొప్పించడం దేశ మౌలిక సూత్రాలకు భంగం కలిగే అవకాశముందన్నారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ ఆసన్నమైందని చెప్పారు. వెంటనే పీఆర్సీ కమిటీని నియమించాలని కోరారు. ఈ ఏడాది, జులై నుంచే కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నందున ఉద్యోగ, ఉపాధ్యాయులు గత పీఆర్సీలాగా నష్టపోతామంటూ ఆందోళన చెందుతున్నారని అన్నారు. పీఆర్సీని ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను వెంటనే మంజూరు చేయాలని, పదోన్నతులు, బదిలీలకు సంబంధించి కోర్టులో ఉన్న స్టేను ఖాళీ చేయించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని, వాటిని వేసవి సెలవుల్లోనే చేపట్టాలని, అన్ని గురుకుల సొసైటీలను ఒకే డైరెక్టరేట్ పరిధిలోకి తెచ్చి ఒకే టైంటేబుల్ వర్తింపచేయాలని, పారిటీ స్కేల్‌ను అమలు చేయాలని, వాటిలోని ఉపాధ్యాయులకు 70:30 దామాషాలో పదోన్నతులు, బదిలీలు జీవోనెంబర్ 317ను అమలు చేయాలని, మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టేలా, కోర్టు ఆటంకాలను తొలగించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ సిబ్బందికి ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయాలని, కేజీబీవీ టీచర్లకు బేసిక్ పేను వేతనంగా చెల్లించాలంటూ తీర్మానాన్ని ఆమోదించారు.