Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ.. మంత్రి జగదీశ్‌రెడ్డితో ఆదివారం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ చర్చల్లో ప్రభుత్వం వైపు నుంచి 7 శాతం మేర పీఆర్సీని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను జేఏసీ తిరస్కరించింది. విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో సోమవారం నుంచి కొనసాగే సన్నాహక సమావేశాలు యధావిధిగా కొనసాగుతాయని జేఏసీ నాయకులు సాయిబాబు, పి.రత్నాకరరావు, శ్రీధర్, బీసీ రెడ్డి, అనిల్ కుమార్, వజీర్ తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. ఆదివారం నిర్వహించిన చర్చల్లో ట్రాన్స్‌కో, జెన్కో సీఎమ్‌డీ ప్రభాకరరావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎమ్‌డీ గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎమ్డీ శ్రీనివాసరావు, జేఏసీ నాయకులు గోవర్థన్, వెంకన్న గౌడ్, సుధాకరరెడ్డి, రాంజీ, సత్యనారాయణరావు, ఈశ్వరగౌడ్, ప్రభాకర్, నాగరాజు, వేణు, సదానందం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.