Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లుతోంది :ఆప్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నదనీ, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమ్ ఆద్మి పార్టీ ఆధ్వర్యంలో 'మోడీ హటావో-దేశ్‌కి బచావో' నినాదంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దిడ్డి సుధాకర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ 2014లో మోడీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారని గుర్తుచేశారు. నల్ల ధనాన్ని బయటకు తెస్తాం.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామనే వాగ్దానాలెన్నో చేసి ఇప్పుడు చేతులెత్తేరని విమర్శించారు. ఇలాంటి అంశాల నుంచి ప్రజల ఆలోచనల్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గుడుపుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతికి వ్యతిరేకమంటూ గప్పాలు కొట్టే మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ అదాని గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పటం లేదని నిలదీశారు. రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థలను పార్టీ ప్రయోజనాలకు వాడుకోవద్దని హితవు పలికారు. సుధాకర్ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు సమస్యలన్నీ పక్కనపెట్టి, దైవభక్తి, దేశభక్తి పేరుతో దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాపంథా రాష్ట్ర నాయకులు ఎస్ఎల్ పద్మ మాట్లాడుతూ దేశంలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావుల తదితరులను పక్కదారి పట్టించడంలో మోడీ అగ్రభాగాన ఉన్నారని తెలిపారు.భారత రాజ్యాంగాన్ని మార్చేసి దాని స్థానంలో మనుస్మృతిని ప్రవేశ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాద్యక్షులు ఎంఆర్జీ వినోద్ రెడ్డి, ఆఫ్ కోర్ కమిటీ సభ్యులు భూక్యా శోభన్‌బాబు, బుర్ర రాములు గౌడ్, మాజీద్, అబ్దుల్ ముక్తార్ తదితరులు పాల్గొన్నారు.